పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన స్పెయిన్ బుల్ నాదల్కు యూఎస్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. అనామక ఆటగాడు ఫ్రాన్సెస్ టియాఫో చేతిలో నాదల్ ఓటమి పాలయ్యాడు. ఇప్పటికే 22 టైటిల్స్ చేజిక్కించుకున్న నాదల్కు ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్స్‌లో ఇదే తొలి పరాజయం కాగా.. మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్ స్వియాటెక్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో పురుషుల విభాగంలో సోమవారం అతి పెద్ద సంచలనం నమోదైంది. ఫ్రాన్స్‌కు చెందిన అనామక ఫ్రాన్సెస్ టియాఫొ తన కెరీర్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్నాడు. టియాఫొ 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత రాఫెల్ నాదల్‌ను 6-4, 4-6, 6-4, 6-3తో ఓడించి తొలి సారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ యేడాది నాదల్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఓడిపోవడం ఇదే తొలి సారి. ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో టైటిల్స్ నెగ్గిన నాదల్, వింబుల్డన్ సెమీఫైనల్లో పొత్తికడుపు నొప్పితో మధ్యలో తప్పుకున్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో వరుసగా 17 సార్లు క్వార్టర్‌ఫైనల్, అంతకు పైస్థాయికి చేరుకున్న నాదల్ జోరుకు టియాఫో చెక్ చెప్పాడు. 23వ టైటిల్ సాధించాలనుకున్న నాదల్ కలలు కల్లలయ్యాయి.
ఒక విధంగా టియాఫొ ప్రతిభ కంటె స్వయం తప్పిదాలే నాదల్ ఓటమికి కారణమయ్యాయి. నాదల్ తొమ్మిది డబుల్ఫాల్ట్స్తోపాటు ఏస్‌లు (9)కూడా తక్కువగానే చేశాడు. మరోవైపు టియాఫొ నాలుగు డబుల్‌ఫాల్ట్స్ చేయగా, 18 ఏస్‌లు సర్వ్ చేశాడు. బ్రేక్ పాయింట్లలోనూ టియోఫొదే పైచేయి. టియాఫొ ఎనిమిదింటిలో అయిదు సద్వినియోగం చేసుకోగా, నాదల్ ఆరు అవకాశాలలో రెండు మాత్రమే అనుకూలంగా మలచుకున్నాడు. మొత్తంగా సర్వీసులు, రిటర్న్‌లలో నాదల్ పూర్వ వైభవం ప్రదర్శించలేకపోయాడు. టియాఫొ క్వార్టర్‌ఫైనల్ ప్రత్యర్థి రష్యాకు చెందిన ఆండ్రీ రుబ్లెవ్. రుబ్లెవ్ వరుస సెట్లలో 6-4, 6-4, 6-4తో బ్రిటన్ ఆటగాడు కామెరూన్ నోరిపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. రుబ్లెవ్ యుఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి.ఇతర మ్యాచ్‌లలో మూడో సీడ్ కార్లొస్ అల్కారజ్ గార్ఫియా 6-4, 3-6, 6-4, 4-6, 6-3తో 15వ సీడ్ మారిన్ సిలిక్‌పై, సిన్నర్ 6-1, 5-7, 6-2, 4-6, 6-3తో యువ సంచలనం ఇల్యా ఇవాష్కపై గెలుపొందారు.
స్వియాటెక్ కష్టంగా..
మహిళల టాప్‌సీడ్ ఇగా స్వియాటెక్ జర్మనీకి చెందిన అనామక క్రీడాకారిణి జూల్ నీమియర్నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నది. రెండున్నర గంటలపాటు సాగిన పోరులో స్వియాటెక్ 2-6, 6-4, 6-0తో నేమియర్ను ఓడించింది. ఏస్‌ల (5)లో ఆధిక్యం ప్రదర్శించిన నేమియర్ డబుల్‌ఫాల్ట్స్ (13)లోనూ ఆధిక్యంతో ఓటమి కొనితెచ్చుకుంది. తొలి సెట్ కోల్పోయి రెండో సెట్ వెనుకంజలో ఉన్న తరుణంలో స్వియాటెక్ ఒక్కసారిగా పుంజుకుని వరుసగా మూడు గేమ్‌లను గెలుచుకుని పోటీలో నిలిచింది. ఇక మూడో సెట్లో రెండు బ్రేక్‌లతో ఒక్క గేమ్నుకూడా వదలకుండా సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరో మ్యాచ్‌లో అరినా సబలెంక 3-6, 6-3, 6-2తో డేనియల్ కొలిన్స్‌పై నెగ్గింది.