ప్రధాన ప్రత్యర్థులు దూరమైన వేళ స్పెయిన్ బుల్ నాదల్ టెన్నిస్ చరిత్రలో నయా అధ్యాయాన్ని లిఖించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాడు! పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్, జొకోవిచ్‌తో కలిసి 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న నాదల్.. 21వ టైటిల్‌కు మరో రెండు విజయాల దూరంలో నిలిచాడు. మిక్స్డ్ డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా తన పోరాటాన్ని ముగించగా.. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆష్లే బార్టీ సెమీఫైనల్‌కు చేరింది!
మెల్బోర్న్: సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆరో సీడ్ నాదల్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పట్టి.. ఫెదరర్, జొకోవిచ్‌తో కలిసి అగ్రస్థానంలో ఉన్న నాదల్.. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 6-3, 6-4, 4-6, 3-6, 6-3తో డెనిస్ షపలోవ్ (కెనడా)పై విజయం సాధించాడు. నాలుగు గంటలా 8 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి రెండు సెట్లు పూర్తి ఆధిపత్యం కనబర్చిన నాదల్.. ఆ తర్వాత చెమటోడ్చి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. 14వ సీడ్ షపలోవ్ 20 ఏస్‌లతో విజృంభిస్తే.. నాదల్ తొమ్మిందింటికే పరిమితమయ్యాడు. నాదల్ 3 బ్రేక్ పాయింట్లు సాధించగా.. షపలోవ్ రెండు గెలుచుకున్నాడు. మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలతో పోల్చుకుంటే ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఒకింత వెనుకబడిపోయిన నాదల్ ఈసారి పూర్తి స్థాయిలో సత్తాచాటుతున్నాడు. 2009లో ఇక్కడ ఏకైక టైటిల్ నెగ్గిన నాదల్.. గతేడాది గాయం కారణంగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనలేదు. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ బెర్టిని 6-4, 6-4, 3-6, 3-6, 6-2తో మోనోఫిల్స్పై గెలుపొందాడు.
సెమీస్‌లో బార్టీ..
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) సెమీస్‌కు చేరింది. మంగళవారం జరిగిన క్వార్టర్స్‌లో బార్టీ 6-2, 6-0తో జెస్సిక పెగులాపై గెలుపొందింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్‌కు చేరడం బార్టీకి ఇది రెండో సారి కాగా.. మరో క్వార్టర్స్‌లో కైస్ 6-3, 6-2తో క్రెజికోవాపై విజయం సాధించింది.
సానియా ఓటమి
ఈ సీజన్ అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. మంగళవారం జరిగిన పోరులో సానియా మీర్జా-రాజీవ్ రామ్ (అమెరికా) ద్వయం 4-6, 6-7 (5/7)తో కుబెర్-ఫెర్టిస్ జంట చేతిలో ఓడింది.