పేస్ పరేషాన్.. వన్డేల్లో భారత పేస్ బౌలింగ్ డీలా
న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా యాజమాన్యానికి బౌలింగ్ సవాలు ఎదురవుతోంది.
- అనుభవం లేని బౌలర్లతో మేనేజ్మెంట్కు సవాల్
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా యాజమాన్యానికి బౌలింగ్ సవాలు ఎదురవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉనికితో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తున్నప్పటికీ అనుభవజ్ఞులైన పేసర్లు లేకపోవడం జట్టును ఇబ్బంది పెడుతోంది. బౌలింగ్ దళంలో ఉన్న గుర్నూర్ బ్రార్, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, యష్ ఠాకూర్ నలుగురూ కలిపి ఇప్పటివరకు ఆడింది కేవలం 11 వన్డేలు కావడమే ఇందుకు కారణం. పైగా జట్టులోని బౌలర్లందరూ న్యూజిలాండ్ గడ్డపై తమ కెరీర్లో తొలిసారి వన్డే సిరీస్ ఆడబోతున్నారు.
భారం అర్ష్‌దీప్‌పైనే..
ప్రస్తుత జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ (51 వన్డేల్లో 77 వికెట్లు) టెస్టు సిరీస్ సన్నాహకాల్లో భాగంగా తొలి మూడు వన్డేల అనంతరం జట్టును వీడనున్నాడు. ఏకైక ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా టెస్టు సిరీస్ ప్రిపరేషన్స్ కోసం తొలి వన్డే ముగిసిన వెంటనే వైదొలగనున్నాడు. దీంతో 18 వన్డేల అనుభవం ఉన్న అర్ష్‌దీప్ సింగ్ పేస్ దళానికి నాయకత్వం వహించాల్సి ఉంటుంది. అతడికి తోడుగా గుర్నూర్ బ్రార్ (9 వన్డేలు), అన్షుల్ కాంబోజ్ (1 వన్డే), ఆకిబ్ నబీ (1 వన్డే) ఉండనుండగా.. చివరి రెండు మ్యాచ్‌లకు ఎంపికైన యష్ ఠాకూర్ ఇంకా అరంగేట్రం చేయలేదు.
మూడో పేసర్ ఎవరు?
ఈడెన్ పార్క్ వంటి చిన్న బౌండరీలు ఉన్న బ్యాటింగ్ పిచ్‌పై మూడో పేసర్‌ను ఎంచుకోవడం జట్టు యాజమాన్యానికి పెద్ద సమస్యగా మారింది. ఈ మైదానంలో డబుల్ రన్ తీయడం కూడా కష్టమైన విషయమే. బ్యాటర్లు సింగిల్ తీయడం లేదంటే ఫోర్లు, సిక్సర్ల కొట్టాల్సిందే. 6 అడుగుల 5 అంగుళాల పొడవున్న బ్రార్ తన ఎత్తును ఉపయోగించుకొని అదనపు బౌన్స్ రాబట్టగలడు. అయితే ఓవర్‌కు 7.71 రన్ రేట్‌తో పరుగులు ఇస్తుండటం అతడి బలహీనత. ఇక, కాంబోజ్, నబీ ఇద్దరూ 135 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలరు. అయితే వీరికి అంతర్జాతీయ అనుభవం లేకపోవడంతో ఒత్తిడిలో ఎలా రాణిస్తారనేది వేచి చూడాలి. వైవిధ్యమైన యార్కర్లు, స్లోయర్ బంతులతో ఆకట్టుకునే యష్ ఠాకూర్ తొలి రెండు వన్డేలకు అందుబాటులో ఉండటం లేదు.
కుల్దీప్కు చాన్స్!
వన్డేల్లో 124 మ్యాచ్‌ల్లో 201 వికెట్లు తీసి ప్రస్తుత జట్టులో అత్యంత విజయవంతమైన స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్‌కు జట్టులో చోటు కష్టమైంది. 8వ స్థానం వరకు బ్యాటర్లు ఉండాలనే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహమే ఇందుకు కారణం. ఈ టూర్లో టీ20 సిరీస్‌లో అతను బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే, వన్డే ఫార్మాట్లో అనుభవం ఉన్న బౌలర్లకు జట్టుకు అవసరరం. ఈ నేపథ్యంలో తొలి వన్డే నుంచే అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
గిల్ ప్రాక్టీస్ జోరు..
వన్డే సిరీస్ కోసం భారత్ సన్నాహకాలను ముమ్మరం చేసింది. సోమవారం ఈడెన్ పార్క్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సుదీర్ఘ సమయం పాటు చెమటోడ్చాడు. భారీ వర్కౌట్‌కు ప్రాధాన్యమిచ్చే గిల్ దాదాపు మూడు గంటల పాటు మారథాన్ నెట్ సెషన్లో గడిపాడు. ఆదివారం ముమ్మర సాథన చేసిన పేసర్లు అన్షుల్ కాంబోజ్, బ్రార్, ఆకిబ్ విశ్రాంతి తీసుకోవడంతో నెట్ బౌలర్లను సుదీర్ఘంగా ఎదుర్కొన్న చేసిన గిల్, ఆ తర్వాత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బాహుతులే పర్యవేక్షణలో స్లిప్స్, బౌండరీ లైన్ వద్ద హై క్యాచ్‌లు పట్టే ప్రత్యేక ఫీల్డింగ్ డ్రిల్స్‌లో పాల్గొన్నాడు. గిల్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సైతం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. తొలుత వికెట్ కీపింగ్ డ్రిల్స్ చేసిన రాహుల్, ఆ తర్వాత గిల్‌తో కలిసి ఎక్కువ సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెట్స్‌లో బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయకుండా, కేవలం జిమ్ సెషన్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ కూడా నెట్స్‌కు రాకుండా హోటల్ గదుల్లోనే విశ్రాంతి తీసుకున్నారు. హామిల్టన్ నుంచి ఆక్లాండ్‌కు చేరుకున్న మిగతా ఆటగాళ్లందరూ మంగళవారం జరిగే ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటారు.
వన్డే సిరీస్‌కు రచిన్, చాప్మన్ దూరం
భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుకు షాక్ తగిలింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా సీనియర్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. దాంతో చివరి రెండు వన్డేలకు మాత్రమే ఎంపికైన వికెట్ కీపర్ టిమ్ సిఫర్ట్ ఇప్పుడు సిరీస్ మొత్తం అందుబాటులో ఉంటాడని కివీస్ బోర్డు ప్రకటించింది.హెన్రీ నికోల్స్‌ను తొలి మూడు మ్యాచ్‌లకు, డీన్ ఫాక్స్క్రాఫ్ట్ను చివరి రెండు మ్యాచ్‌లకు జట్టులోకి తీసుకుంది. మరోవైపు గాయం నుంచి కోలుకున్న మాథ్యూ హెన్రీ సోమవారం జట్టుతో చేరాడు. అతని ఫిట్నెస్ను పరిశీలించిన తర్వాత మ్యాచ్‌లో ఆడించే అవకాశం ఉంది. పేసర్ మ్యాట్ ఫిషర్‌ను ఎక్స్ట్రా బౌలర్‌గా వన్డే సిరీస్ మొత్తానికి జట్టుతోనే ఉంచాలని కివీస్ బోర్డు నిర్ణయించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

