మెల్బోర్న్: సొంతగడ్డపై దుమ్మురేపుతున్న ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ విజయం సాధించింది. గురువారం ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 15/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 204 పరుగులకు ఆలౌటైంది. బవుమా (65) కాస్త పోరాడాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్ 3, స్కాట్ బొలాండ్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 575/8 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. డబుల్ సెంచరీతో చెలరేగిన వార్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.