వన్డే ప్రపంచకప్‌లో మూడుసార్లు 150కి పైగా పరుగుల సాధించిన ఏకైక ప్లేయర్‌గా వార్నర్ చరిత్రకెక్కాడు.బంతిపై పగబట్టినట్లు.. పాకిస్థాన్ బౌలర్లపై ఆజన్మ శత్రుత్వం ఉన్నట్లు.. బెంగళూరులో అడుగు పెట్టింది బాదడానికే అన్నట్లు.. ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్, మార్ష్ వీరంగమాడారు. కొడితే సిక్స్ లేదా ఫోర్ అన్నట్లు పాకిస్థాన్ బౌలింగ్‌ను ఊచకోత కోశారు!
ఓపెనర్ల దంచుడుకు రికార్డులు బద్దలైనా.. ఆ తర్వాత కాస్త ప్రతిఘటన చూపిన పాకిస్థాన్.. కంగారూలను అడ్డుకోగా.. మంచి ఆరంభం లభించిన తర్వాత ఆ జట్టు ఛేదనలో తడబడింది. ఫలితంగా వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది.
తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాల తర్వాత కంగారూల పని అయిపోయినట్లే అని భావించిన వారికి చాంపియన్ ఆటతీరు ఎలా ఉంటుందో ఆసీస్ చేతల్లో చూపింది. పూర్తి సాధికారికతతో కదం తొక్కి పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది!
CWC | బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం చిన్నబోయేలా ఓపెనర్లు శివతాండవం ఆడటంతో.. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన పోరులో ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. గత మ్యాచ్‌లో టీమ్ఇండియా చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్‌కు ఇది వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (124 బంతుల్లో 163; 14 ఫోర్లు, 9 సిక్సర్లు), బర్త్‌డేబాయ్ మిషెల్ మార్ష్ (108 బంతుల్లో 121; 10 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 259 పరుగులు చేశారు. 10 పరుగుల వద్ద వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను ఉసామా నేల పాలు చేయగా.. దాన్ని సద్వినియోగం చేసుకున్న డేవిడ్ భాయ్ పాక్‌పై వరుసగా నాలుగో సెంచరీ నమోదు చేశాడు.
ఈ దంచుడు చూస్తే.. ఆస్ట్రేలియా మరింత భారీ స్కోరు చేయడం ఖాయమే అనిపించినా.. ఆ తర్వాత వచ్చిన వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మ్యాక్స్‌వెల్ (0) గోల్డెన్ డకౌట్ కాగా.. స్టీవ్ స్మిత్ (7), స్టోయినిస్ (21), జోష్ ఇంగ్లిస్ (13), లబుషేన్ (8) విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 5 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రవుఫ్ 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 45.3 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీఖ్ (64; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇమాముల్ హక్ (70; 10 ఫోర్లు) అర్ధశతకాలు సాధించడంతో పాకిస్థాన్‌కు మెరుపు ఆరంభం లభించింది. ఒక దశలో 134/1తో నిలిచిన ఆ జట్టు ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (18), మహమ్మద్ రిజ్వాన్ (46), సౌద్ షకీల్ (30), ఇఫ్తిఖార్ అహ్మద్ (26), మహమ్మద్ నవాజ్ (26) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో జాంపా 4, కమిన్స్, స్టోయినిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వార్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరఫున ఇదే (వార్నర్- మార్ష్ 259) అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. ఓవరాల్‌గా రెండోది. 2011లో లంక ఓపెనర్లు తిలక రత్నే దిల్షాన్-ఉపుల్తరంగా 282 పరుగులు చేసి టాప్‌లో కొనసాగుతున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యధికంగా 5 సెంచరీలు చేసిన పాంటింగ్‌ను వార్నర్ సమం చేశాడు.
వరల్డ్‌కప్‌లో ఒకే జట్టు ఓపెనర్లు సెంచరీలు చేయడం ఇది నాలుగోసారి. ఉపుల్ తరంగ-దిల్షాన్ (శ్రీలంక) రెండుసార్లు, రోహిత్-రాహుల్ ఒకసారి ఈ ఫీట్ నమోదు చేశారు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 367/9 (వార్నర్ 163, మార్ష్ 121; షాహీన్ 5/54, రవుఫ్ 3/83), పాకిస్థాన్: 45.3 ఓవర్లలో 305 ఆలౌట్ (ఇమామ్ 70, అబ్దుల్లా 64; జాంపా 4/53, స్టోయినిస్ 2/40).