జిమ్ లేకర్, అనిల్‌కుంబ్లే సరసన పటేల్
భారత్ తొలి ఇన్నింగ్స్ 325, న్యూజిలాండ్ 62 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్ 69/0 l 332 పరుగుల ఆధిక్యంలో టీమ్ఇండియా
లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అద్భుతః అనదగ్గ రీతిలో విశ్వరూపం కనబర్చినా.. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమ్ఇండియా పైచేయి సాధించింది! అజాజ్ ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టి జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే సరసన నిలిచినా.. కివీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ముంబై టెస్టులో కోహ్లీసేన విజయానికి చేరువైంది. అజాజ్ విజృంభణ మధ్య మయాంక్ అగర్వాల్ భారీ శతకంతో చెలరేగడంతో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు చేస్తే.. బదులుగా న్యూజిలాండ్ 62 పరుగులకే ఆలౌటైంది! ఫాలోఆన్ చాన్స్ ఉన్నా మరోసారి బ్యాటింగ్‌కే మొగ్గుచూపిన విరాట్ కోహ్లీ.. లక్ష్యాన్ని మరింత పెంచే పనిలో నిమగ్నమవగా.. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న తరుణంలో వరుణుడిని ప్రార్థించడం తప్ప బ్లాక్‌క్యాప్స్‌కు వేరే దారి కనిపించడం లేదు!
ముంబై: రికార్డులకు నెలవుగా మారిన రెండో టెస్టుపై టీమ్ఇండియా పట్టు సాధించింది. న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ తన సంచలన బౌలింగ్‌తో ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించిన చోట.. మన బౌలర్లు అంతకుమించిన విధ్వంసాన్ని రచించారు. ఫలితంగా భారత్, న్యూజిలాండ్ మధ్య వాంఖడే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీసేన ముందంజలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 221/4తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా.. అజాజ్ పటేల్ (10/119) ధాటికి 325 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (311 బంతుల్లో 150; 17 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకం తన పేరిట రాసుకోగా.. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (52) అర్ధశతకంతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 28.1 ఓవర్లలో 62 పరుగులకే ఆలౌటైంది. కైల్ జెమీసన్ (17) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో అశ్విన్ 4, సిరాజ్ 3, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు. కివీస్ బ్యాటింగ్ లైనప్ అనూహ్యంగా తడబడటంతో టీమ్ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది. అయినా ప్రత్యర్థికి ఫాలోఆన్ ఇవ్వని కోహ్లీ.. మరోసారి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. దీంతో తిరిగి క్రీజులో అడుగుపెట్టిన భారత్ శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (38 బ్యాటింగ్; 6 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (29 బ్యాటింగ్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. చేతిలో 10 వికెట్లు ఉన్న టీమ్ఇండియా ప్రస్తుతం 332 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న టెస్టులో టీమ్ఇండియా విజయం ఖాయంగా కనిపిస్తుండగా.. ఆదివారం కివీస్ ముందు కోహ్లీసేన ఎంత లక్ష్యాన్ని నిలుపుతుందనేది ఆసక్తికరం!
టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున అజాజ్ (10/119)దే అత్యుత్తమ ప్రదర్శన. గతంలో ఈ రికార్డు రిచర్డ్ హాడ్లీ (9/52) పేరిట ఉంది.
భారత గడ్డపై టెస్టుల్లో ఇదే (62) అత్యల్ప స్కోరు. 1987లో ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా చేసిన చేసిన స్కోరే (75) ఇప్పటి వరకు అత్యల్పం.
భారత్‌పై ఏ బౌలర్‌కైనా ఇదే (10/119)అత్యుత్తమ ప్రదర్శన.
భారత గడ్డపై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు కావడం ఇది రెండోసారి. 1999లో ఢిల్లీ వేదికగా పాకిస్థాన్‌పై అనిల్ కుంబ్లే ఈ ఫీట్ నమోదు చేశాడు.
‘నా కెరీర్లో ఇదే అత్యుత్తమమైన రోజు. ఈ ఘనత చాలా చాలా ప్రత్యేకమైనది. ఇలాంటి ప్రదర్శన ముంబైలో నమోదు చేయడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. కుంబ్లే పది వికెట్లు తీసిన మ్యాచ్ హైలైట్స్ ఎన్నోసార్లు చూశా.. ఇప్పుడు అతడి నుంచే సందేశం రావడం ఆనందంగా ఉంది. ఇన్నింగ్స్ చివరికొస్తున్నా కొద్ది నాలో టెన్షన్ పెరిగిపోయింది. గతంలో ఎప్పుడూ ఎదుర్కోని పరిస్థితి కావడంతో కాస్త ఆందోళన చెందా! బౌలింగ్‌లో మాత్రం నా ప్రణాళికను అమలు చేసి ఫలితం సాధించా. అయితే మ్యాచ్‌లో మేం వెనుకబడటం నిరాశ కలిగించింది’
-అజాజ్ పటేల్
అజాజ్ @ 3
144 ఏండ్ల సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా అజాజ్ పటేల్ చరిత్రకెక్కాడు. గతంలో జిమ్ లేకర్ (ఇంగ్లండ్, 1956), అనిల్ కుంబ్లే (భారత్, 1999) మాత్రమే ఈ ఫీట్ నమోదు చేశారు. ముంబైలో పుట్టి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్‌కు ఇది 11వ టెస్టు కాగా.. ఇంతకుముందు వరకు అతడు రెండు సార్లు మాత్రమే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. తొలిసారి భారత పర్యటనకు వచ్చిన 33 ఏండ్ల అజాజ్.. సంచలన బౌలింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా తన పేరు మారుమోగేలా చేశాడు.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (సి) బ్లండెల్ (బి) అజాజ్ 150, గిల్ (సి) టేలర్ (బి) అజాజ్ 44, పుజారా (బి) అజాజ్ 0, కోహ్లీ (బి) అజాజ్ 0, శ్రేయస్ (సి) బ్లండెల్ (బి) అజాజ్ 18, సాహా (ఎల్బీ) అజాజ్ 27, అశ్విన్ (బి) అజాజ్ 0, అక్షర్ (ఎల్బీ) అజాజ్ 52, జయంత్ (సి) రచిన్ (బి) అజాజ్ 12, ఉమేశ్ (నాటౌట్) 0, సిరాజ్ (సి) రచిన్ (బి) అజాజ్ 4, ఎక్స్‌ట్రాలు: 18, మొత్తం: 109.5 ఓవర్లలో 325. వికెట్ల పతనం: 1-80, 2-80, 3-80, 4-160, 5-224, 6-224, 7-291, 8-316, 9-321, 10-325, బౌలింగ్: సౌథీ 22-6-43-0, జెమీసన్ 12-3-36-0, అజాజ్ 47.5-12-119-10, సోమర్విల్లె 19-0-80-0, రచిన్ 4-0-20-0, మిచెల్ 5-3-9-0.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (సి) శ్రేయస్ (బి) సిరాజ్ 10, యంగ్ (సి) కోహ్లీ (బి) సిరాజ్ 4, మిచెల్ (ఎల్బీ) అక్షర్ 8, టేలర్ (బి) సిరాజ్ 1, నికోల్స్ (బి) అశ్విన్ 7, బ్లండెల్ (సి) పుజారా (బి) అశ్విన్ 8, రచిన్ (సి) కోహ్లీ (బి) ఉమేశ్ 4, జెమీసన్ (సి) శ్రేయస్ (బి) అక్షర్17, సౌథీ (సి) (సబ్) సూర్యకుమార్ (బి) అశ్విన్ 0, సోమర్విల్లె (సి) సిరాజ్ (బి) అశ్విన్ 0, అజాజ్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 28.1 ఓవర్లలో 62 ఆలౌట్. వికెట్ల పతనం: 1-10, 2-15, 3-17, 4-27, 5-31, 6-38, 7-53, 8-53, 9-62, 10-62, బౌలింగ్: ఉమేశ్ 5-2-7-0, సిరాజ్ 4-0-19-3, అక్షర్ 9.1-3-14-2, అశ్విన్ 8-2-8-4, జయంత్ 2-0-13-1.
భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (నాటౌట్) 38, పుజారా (నాటౌట్) 29, ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 21 ఓవర్లలో 69/0. బౌలింగ్: సౌథీ 5-0-14-0, అజాజ్ 9-1-35-0, జెమీసన్ 4-2-5-0, సోమర్విల్లె 2-0-9-0, రచిన్ 1-0-4-0