ఈ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ చేజిక్కించుకొని ఇయర్ గ్రాండ్‌స్లామ్ సాధించాలని చూస్తున్న సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్.. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌లో శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో జొకోవిచ్ అలవోకగా గెలువగా.. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ముందంజ వేసింది.
వింబుల్డన్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌లో స్టార్ ప్లేయర్లు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ జొకోవిచ్, నాలుగో సీడ్ రూడ్, ఏడో సీడ్ రూబ్లేవ్ తొలి రౌండ్లో విజయాలు సాధించగా.. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్, నాలుగో సీడ్ పెగులా ముందంజ వేశారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌తో పాటు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఖాతాలో వేసుకొని ఫుల్ జోష్‌లో ఉన్న జొకోవిచ్ తొలి రౌండ్లో 6-3, 6-3, 7-6 (7/4)తో కచిన్పై విజయం సాధించాడు. ఏకపక్షంగా సాగిన పోరులో జొకోవిచ్ 13 ఏస్‌లు సంధించి.. 45 విన్నర్లు కొట్టగా.. ప్రత్యర్థి 10 ఏస్‌లకే పరిమితమై 28 విన్నర్లు సాధించాడు.
కచిన్కు ఏమాత్రం అవకాశం ఇవ్వని జొకోవిచ్ 4 బ్రేక్ పాయింట్లు సొంతం చేసుకోగా.. 29 అనవసర తప్పిదాలతో కచిన్ మూల్యం చెల్లించుకున్నాడు. ఓపెన్ ఎరాలో ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి.. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన ఆటగాడిగా నిలిచిన జొకో.. మార్గరేట్ కోర్ట్ రికార్డు (24 గ్రాండ్‌స్లామ్స్)ను సమం చేసేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో రూడ్ 6-1, 5-7, 6-4, 6-3తో లొకోలీపై గెలువగా.. రుబ్లేవ్ 6-3, 7-5, 6-4తో పర్సెల్ను చిత్తుచేశాడు.
ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ విజేత స్వియాటెక్ వింబుల్డన్‌లో బోణీ కొట్టింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో స్వియాటెక్ 6-1, 6-3తో లీ జూపై గెలుపొందింది. నాలుగో సీడ్ పెగులా 6-2, 6-7 (6/8), 6-3తో డావిస్పై విజయం సాధించింది. ఐదో సీడ్ గార్సియా 6-1, 6-3తో మెక్నల్లీపై నెగ్గగా.. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ మంగళవారం జరుగనున్న తొలి రౌండ్లో చార్డీతో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో అమెరికా యువ సంచలనం కోకో గాఫ్‌పై భారీ అంచనాలు ఉండగా.. వెటరన్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనుంది.