YouTube | యూట్యూబ్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఫీచర్ వినియోగదారులకు ఇతర యాప్‌లను ఉపయోగిస్తూనే చిన్న ఫ్లోటింగ్ విండోలో వీడియోలను చూసే అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు ఈ ఫీచర్‌కు సంబంధించి ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైస్‌లలో సమస్య ఉన్నట్లు గూగుల్ అధికారికంగా అంగీకరించింది. ఈ మేరకు గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది. కొంతమంది వినియోగదారులు యూట్యూబ్ యాప్‌ను క్లోజ్ చేశాక పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్ యాక్టివేట్ కాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపింది. సాధారణంగా యాప్ నుంచి బయటకు వచ్చిన వెంటనే స్క్రీన్ మూలలో చిన్న ఫ్లోటింగ్ వీడియో ప్లేయర్ కనిపించి వీడియో కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం సమస్య కారణంగా వీడియో కనిపించకుండా కేవలం ఆడియో మాత్రమే బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది.
ఈ సమస్యను యూట్యూబ్ ఇటీవలే తన అధికారిక హెల్ప్ ఫోరమ్‌లో మొదట గుర్తించింది. దీనిపై తమ సాంకేతిక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని కంపెనీ తెలిపింది. అయితే ఈ సమస్యకు పరిష్కారంపై ఎలాంటి తాజా సమాచారం ఇవ్వలేదు. ఈ బగ్ ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండు ప్లాట్‌ఫామ్‌లలోనూ కనిపిస్తున్నప్పటికీ, ఎక్కువ ఫిర్యాదులు ఐఓఎస్ వినియోగదారుల నుంచే వస్తున్నాయని, ఆండ్రాయిడ్ నుంచి వచ్చిన నివేదికలు చాలా తక్కువగా ఉన్నాయని గూగుల్ వెల్లడించింది. కాగా ఈ ఫీచర్ ద్వారా యూట్యూబ్‌లో వీడియో చూస్తున్న సమయంలో హోమ్ బటన్ నొక్కినా లేదా స్క్రీన్‌పై స్వైప్ చేసి యాప్ నుంచి బయటకు వచ్చినా వీడియో చిన్న ఫ్లోటింగ్ విండోలో కొనసాగుతుంది. ఈ చిన్న వీడియో ప్లేయర్‌ను స్క్రీన్‌పై ఎక్కడైనా కదిలించి ఉంచుకోవచ్చు. ఇతర యాప్‌లను ఉపయోగిస్తున్నప్పటికీ వీడియోను చూస్తూ ఉండే అవకాశం ఈ ఫీచర్ కల్పిస్తుంది.
మొదట ఈ ఫీచర్ అమెరికా వెలుపల ఉన్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వంతో మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం అమెరికా వెలుపల ఉన్న వినియోగదారులకు కూడా ప్రత్యేక సబ్స్క్రిప్షన్ లేకుండానే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ PiP ఫీచర్ ఉపయోగించకూడదనుకుంటే, యూట్యూబ్ యాప్ నుంచి బయటకు వచ్చే ముందు వీడియోను పాజ్ చేయడం లేదా పూర్తిగా ఆపేయడం ద్వారా అది యాక్టివేట్ కాకుండా నిరోధించవచ్చు. అలాగే ఫీచర్ సరిగా పనిచేయకపోతే యాప్ లేదా పరికరం సెట్టింగ్‌లను పరిశీలించాల్సి ఉంటుంది. PiP ఫీచర్‌ను పూర్తిగా ఆఫ్ చేయాలంటే యూట్యూబ్ యాప్‌లో సెట్టింగ్స్ > ప్లేబ్యాక్ > పిక్చర్-ఇన్-పిక్చర్ కు వెళ్లి టోగుల్ను ఆఫ్ చేయాలి.