Korean Lover : ఆన్లైన్ గేమ్స్ పిల్లలు, యువత ప్రాణాలు తీస్తున్నాయి. కొన్నేళ్లక్రితం పలువురి మరణాలకు కారణమైన బ్లూ వేల్స్ గేమ్‌లాగే ఇప్పుడు ఇంకో గేమ్ అందుబాటులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. కొరియన్ లవర్ పేరుతో వచ్చిన ఒక గేమ్ ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లల ఆత్మహత్యకు దారితీసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. అయితే, కొరియన్ లవర్ గేమ్ కూడా బ్లూ వేల్ లాగే ప్రమాదకరమైందా అనే సందేహాలు మొదలయ్యాయి.
ఈ గేమ్ ఎలా ఉంటుంది..
నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. ఇది టాస్క్ బేస్డ్ ఆన్లైన్ గేమ్. ఇది ప్లేయర్స్‌ను ఎమోషనల్‌గా కనెక్ట్ చేసుకుని, నెమ్మదిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. కొరియన్ డ్రామాలకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి తెలిసిందే. చాలా మంది యువత కొరియన్ యూత్ పాత్రలతో కనెక్ట్ అవుతారు. అమ్మాయిలు.. కొరియన్ అబ్బాయల్ని, అబ్బాయిలు.. కొరియన్ అమ్మాయిల్ని ఇష్టపడుతుంటారు. ఈ అంశాన్నే ఈ గేమ్ బేస్ చేసుకుని తయారు చేశారు. అంటే కొరియన్ లవర్ గేమ్‌లో అమ్మాయిని లేదా అబ్బాయిని లవర్‌గా ఊహించుకోవచ్చు.
అలా వారితో వర్చువల్ రొమాన్స్, కన్వర్జేషన్ వంటి వాటి ద్వారా ప్లేయర్లు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. ఇది ముందు ఎలాంటి హానీ చేయదు. కానీ, ఒకసారి గేమ్ కంట్రోల్లోకి వెళ్లాక దాని అధీనంలోనే ఉండిపోతారు. గేమింగ్‌లో పాత్ర చెప్పిన టాస్కులు చేయాలి. ఈ గేమ్ వర్చువల్ రిలేషన్‌ను నిజం అనుకునేలా చేస్తుంది. దీంతో ప్లేయర్లు అది నిజమనుకుని భ్రమలో ఉండిపోతారు. ఇదే వారి కొంపముంచుతుంది. మొత్తం ఇందులో 50 టాస్కులుంటాయి. ముందుగా చిన్న టాస్కులు ఇస్తుంది. ఆ తర్వాత స్కూల్ బంకు కొట్టేలా చేస్తుంది. తర్వాత ఒంటరిగా ఉండటం, ఫ్యామిలీకి దూరంగా ఉండటం వంటివి చేస్తూ మానసికంగా దెబ్బతీస్తుంది. ఒకవేళ చెప్పిన పనులు చేయకపోతే ఎమోషనల్‌గా ఒత్తిడి తేవడం, బెదిరించడం, భయపెట్టడం చేస్తుంది.
చివరకు ప్లేయర్లు తమకు తాము హాని చేసుకోవడమో లేదా ఆత్మహత్య చేసుకోవడమో చేస్తారు. ఇది మొదట్లో అంత వయొలెన్స్గా ఉండదు. సున్నితంగా, ఎమోషనల్‌గా, రొమాంటిక్‌గా కనెక్ట్ చేస్తుంది. తరచూ మెసేజ్ చేస్తుంది. ఈ రిప్లైల కోసం యాప్ వాడేందుకు యూత్ ఎక్కువ టైం కేటాయిస్తారు. ఇందులోని వర్చువల్ లవర్‌ను సొంతంగా ఫీలవుతారు. ఎక్కడ లవర్ తమకు దూరమవుతారో అని ప్లేయర్లు గేమ్‌లోని క్యారెక్టర్లు చెప్పినట్లే చేస్తారు. ఒక దశదాటాక.. రియల్ లైఫ్‌లోని వ్యక్తులకంటే గేమ్‌లోని క్యారెక్టర్లే ఎక్కువగా నచ్చుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో బ్లూ వేల్ ఎలా అయితే ప్లేయర్లను వశపరచుకుని వారి జీవితాల్ని నాశనం చేసిందో.. ఇప్పుడు కొరియన్ లవర్ కూడా ఇలాగే చేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇలాంటి గేమ్స్ ఆడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.