గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా యువతరాన్ని ‘లైగర్’ మేనియా ఆవహించింది. వివిధ నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొన్నచిత్ర బృందానికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. హిందీలో విజయ్ దేవరకొండ నటించిన తొలి చిత్రమిదే అయినప్పటికీ ఉత్తరాదిన ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. తనదైన విలక్షణ వ్యకిత్వం, ఆటిట్యూడ్‌తో విజయ్ దేవరకొండ యువతరంలో సముపార్జించుకున్న క్రేజ్ ఏమిటో ప్రచార కార్యక్రమాల సందర్భంగా తెలిసొచ్చింది. ట్రైలర్ సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించింది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్య కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనికోసం విజయ్ దేవరకొండ విదేశాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకొని సరికొత్త మేకోవర్‌తో సిద్ధమయ్యాడు. కరణ్‌జోహార్ వంటి అగ్ర దర్శకనిర్మాత ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడం కూడా నార్త్ బెల్ట్‌లో ఈ సినిమా భారీ హైప్‌కు కారణమైంది. అన్నింటికంటే ముఖ్యంగా బాక్సింగ్ దిగ్గజం మైక్‌టైసన్ ఈ సినిమాలో నటించడం, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ వంటి కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకోవడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. పాన్ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ క్రేజీయెస్ట్ మూవీ సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మేజిక్‌ను క్రియేట్ చేసింది? ప్రేక్షకుల అంచనాల్ని ఏ మేరకు నిజం చేసిందో తెలుసుకుందాం..
తన కొడుకు లైగర్ ను (విజయ్ దేవరకొండ) జాతీయ ఎంఎంఏ (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) ఛాంపియన్‌గా చూడాలన్నది బాలామణి (రమ్యకృష్ణ) ఆశయం. అందుకోసం కొడుకును తీసుకొని కరీంనగర్ నుంచి ముంబయి బయలుదేరుతుంది. అక్కడ ఛాయ్ అమ్ముకొని జీవితాన్ని సాగిస్తూ లైగర్‌కు ఎంఎంఏలో శిక్షణ ఇప్పిస్తుంటుంది. ఈ క్రమంలో లైగర్‌కు సంజు (విష్)తో వైరం ఏర్పడుతుంది. విష్ను ఓడించి జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన లైగర్ తన తదుపరి లక్ష్యంగా అంతర్జాతీయ ఎంఎంఏ ఛాంపియన్‌షిప్‌ను ఎంచుకుంటాడు. ఈ ప్రయాణంలో అతను ఎలాంటి అవరోధాల్ని ఎదుర్కొన్నాడు? మార్క్ అండర్సన్ (మైక్ టైసన్)ను ఎంతగానో ఆరాధిస్తూ అతనితో ఓ సెల్ఫీ తీసుకోవాలని ఆరాటపడే లైగర్ చివరకు తన కోరిక నెరవేర్చుకున్నాడా? విష్ చెల్లెలు తానియా తో (అనన్యపాండే) లైగర్ ప్రేమ ఎలా సాగింది? నత్తి సమస్య వల్ల ప్రేయసి తిరస్కారానికి గురైన లైగర్ చివరగా విజేతగా ఎలా నిలిచాడు? అనే ప్రశ్నలకు సమాధానంగా మిగతా చిత్ర కథ నడుస్తుంది..
పూరి జగన్నాథ్ సినిమాల్ని పరిశీలిస్తే కథాపరంగా కొత్తదనమేదీ కనిపించదు. హీరో క్యారెక్టరైజేషన్లో వైవిధ్యత, పవర్ఫుల్ సంభాషణలు, స్టోరీ ట్రీట్మెంట్లో తనదైన మార్క్ చూపించడం ఆయన బలాలుగా చెబుతారు. లైగర్ కథ కూడా అలాంటిదే. సింపుల్‌గా చెప్పాలంటే మదర్సెంటిమెంట్ నేపథ్యంలో అల్లుకున్న రీవేంజ్ డ్రామా ఇది. ఈ కథకు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనే కాన్సెప్ట్‌ను జోడించడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. నత్తి సమస్యతో బాధపడే ఓ సాధారణ యువకుడు ఓ అసాధారణ లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది కమర్షియల్‌గా సేలబుల్ పాయింట్.. కానీ దానిని తెరపై తీసుకొచ్చే విధానంలో దర్శకుడు పూరి జగన్నాథ్ తడబడ్డట్టుగా అనిపించింది. హీరోకి నత్తి సమస్యను పెట్టడంతో ఆ పాత్రకు సంకెళ్లను బిగించినట్లయింది. పూరి సినిమాల్లో హీరో క్యారెక్టర్, సంబాషణలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎంఎంఏ ఫైటర్ వంటి బలమైన హీరో పాత్రకు నత్తిని సమస్యగా చూపించడంతో ఆ పాత్రపై సింపథీ క్రియేట్ చేయలేకపోగా… హద్దులు విధించినట్లుగా అనిపించింది. అయితే ప్రథమార్థంలో కథను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. లైగర్ శిక్షణ సందర్భంగా ఎదుర్కొన్న అవమానాలు, తానియాతో ప్రేమలో పడటం, నత్తి సమస్య ఉందని లైగర్‌ను తానియా నిరాకరించే ఎపిసోడ్స్‌లో ఎమోషన్ పండింది. ఫస్ట్‌హాఫ్‌లో తల్లికొడుకుల సంఘర్షణ, జాతీయ ఛాంపియన్‌గా నిలవడానికి లైగర్ పడిన శ్రమ స్పూర్తివంతంగా అనిపిస్తుంది.
ద్వితీయార్థంలో మాత్రం కథ, కథనాలు గాడి తప్పాయనిపిస్తుంది. ఇంటర్నేషనల్ ఛాంపియన్‌ఫిప్ కోసం అమెరికాలో అడుగుపెట్టిన లైగర్ అందుకోసం చేసే ప్రయత్నాలు ఏమాత్రం మెప్పించవు. సెకండాఫ్‌లో ఎక్కవ యాక్షన్ పార్ట్‌పై దృష్టిపెట్టారు. పోరాట ఘట్టాల్లో విజయ్ దేవరకొండ మేకోవర్ హైలైట్‌గా కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ విషయంలో పూరి జగన్నాథ్ అయోమయానికి గురయ్యాడనిపించింది. మైక్ టైసన్‌ను తీసుకున్నారు కాబట్టే పతాక ఘట్టాల్లో మార్పులు చేసి సాదాసీదాగా ముగించారనే భావన కలుగుతుంది. పతాక ఘట్టాల విషయంలో శ్రద్ధ తీసుకుంటే మరింతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే వీలుండేది. లైగర్, మైక్ టైసన్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్లో కూడా ఎలాంటి ఉత్కంఠ కనిపించలేదు. సినిమాను హడావుడిగా ముగించారనిపించింది. అయితే కథాపరంగా మదర్సెంటిమెంట్ బాగా పండింది. కొడుకును అనుక్షణం ప్రోత్సహిస్తూ స్పూర్తినింపే తల్లిగా రమ్యకృష్ణ పాత్ర ఆకట్టుకుంది.
కథాపరంగా లోపాలున్నా ఈ సినిమాను అంతా తానై నడిపించాడు విజయ్ దేవరకొండ. నత్తి సమస్య వల్ల ఆయన సంభాషణ తాలూకూ మ్యాజిక్ మిస్సయినప్పటికీ తన పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేశాడు. ముఖ్యంగా లైగర్ పాత్ర కోసం శారీరకంగా తనని తాను తీర్చిద్దుకున్న విధానం అబ్బురపరుస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌లో విజయ్ పెట్టిన ఎఫర్ట్ తాలూకు ఫలితం తెరపై కనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ మూవీతో నటుడిగా విజయ్ దేవరకొండ మరో మెట్టెక్కాడనిపించింది. ఆయనలోని మాస్ కోణం అభిమానుల్ని మెప్పిస్తుంది. ఇక బాలమణిగా రమ్యకృష్ణ అభినయం సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాల్లో మంచి సెంటిమెంట్ పండింది. కథానాయిక అనన్యపాండే గ్గామర్ కోసమే తప్ప అభినయానికి ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. ఇతర పాత్రల్లో రోనిత్ రాయ్, చుంకీపాండే, అలీ, విష్ తమ పరిధుల మేరకు మెప్పించారు. ఈ కథపై పూరి జగన్నాథ్ మరింతగా వర్క్ చేస్తే బాగుండేదనిపించింది. ద్వితీయార్థంపై కొంచెం శ్రద్ధ పెడితే సినిమా మరో రేంజ్‌కి వెళ్లేఅవకాశం ఉండేది. ఆయన శైలి సంభాషణలు అక్కడక్కడా మెరిశాయి. రెండు పాటలు బాగున్నాయి. సునీల్‌కశ్యప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పేలవంగా అనిపించింది. కథ తాలూకు ఎమోషన్‌ను ఏమాత్రం ఎలివేట్ చేయలేకపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నిర్మాణపరంగా ఎక్కడా లోపాలు కనిపించవు. ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించారు.
మాస్‌ను మెప్పించే పైసా వసూల్ సినిమాల్ని తీయడంలో దర్శకుడు పూరి జగన్నాథ్ దిట్ట . అయితే ఈ సినిమాలో ఆయన మ్యాజిక్ కాస్త తగ్గినట్లుగా అనిపించింది. విజయ్ దేవరకొండ వన్మేన్షోగా..తనదైన పర్ఫార్మెన్స్తో నిలబెట్టాడు. ఇప్పటికే సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి కాబట్టి సినిమా కమర్షియల్ సక్సెస్ పై ఏమాత్రం సందేహాలు లేకపోయినప్పటికీ …బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో వసూళ్లను రాబడుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే..