ప్రతిపాదనలు సరే పనులెప్పుడు
రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్తు చివరి సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. గడిచిన ఆరు నెలల కాలంలో అభివృద్ధి పనులకు సంబంధించి ఒక్క ప్రొసీడింగ్ కూడా ఇచ్చిన పాపాన పోలేదని సభ్యులు ఆక్రోశం వెళ్లగక్కారు.
- ఆరు నెలలుగా ఒక్క పనికీ ప్రొసీడింగ్ ఇచ్చిన పాపాన పోలేదు
- రంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆవేదన
- విద్య, వైద్య శాఖల పనితీరుపై అసంతృప్తి
- విద్యుత్ అధికారుల తీరును నిరసిస్తూ చైర్మన్ పోడియం ముందు కూర్చుని నిరసన తెలిపిన కడ్తాల్ జడ్పీటీసీ
- రంగారెడ్డి జిల్లాలో విద్య, వైద్యశాఖల్లో ఇంటర్నల్ డిప్యుటేషన్లు వద్దని సభ ఏకగ్రీవ తీర్మానం
- జడ్పీ చైర్పర్సన్ అనితాహరినాథ్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశం
- పాల్గొన్న కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి
రంగారెడ్డి, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్తు చివరి సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. గడిచిన ఆరు నెలల కాలంలో అభివృద్ధి పనులకు సంబంధించి ఒక్క ప్రొసీడింగ్ కూడా ఇచ్చిన పాపాన పోలేదని సభ్యులు ఆక్రోశం వెళ్లగక్కారు. విద్య వైద్యారోగ్య శాఖల పనితీరు బాగాలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ కడ్తాల్ జడ్పీటీసీ సభ్యుడు ఏకంగా చైర్మన్ పోడియం ముందు కూర్చుని నిరసన తెలిపారు. మంగళవారం జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రజాపరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, సీఈవో కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో రంగారావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాం..
అభివృద్ధి పనుల విషయంలో ప్రజలకు మాట ఇచ్చాం. మీరేమో ఒక్క ప్రొసీడింగ్ ఇవ్వకపోతిరి. ఇట్లయితే ప్రజలకు ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకుంటామని సభ్యులు సర్వసభ్య సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తొలుత ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ మహిపాల్ సమావేశంలో మాట్లాడారు. ఆయనకు మిగతా సభ్యులు అంతా మద్దతు పలికారు. ఇంకా తమ పదవీ కాలం ఇరవై రోజులే ఉన్నదని, అప్పటిలోగా ప్రొసీడింగ్స్ ఇస్తేనే ప్రయోజనం ఉంటుందని సభ్యులు కోరారు. ఇందుకు జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి బదులిస్తూ.. ఈ నెల 6 వరకు ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రొసీడింగ్స్ జారీలో ఆలస్యమైందని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ జారీకి కొంత సమయం పడుతుందని, జనరల్ ఫండ్‌కు సంబంధించినవి వారం రోజుల్లో ఇస్తామని చెప్పారు. అయితే మూడు, నాలుగు రోజుల్లో ఇచ్చేలా చూడాలని జడ్పీచైర్‌పర్సన్ కోరారు.
ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్..
ప్రభుత్వ దవాఖానలకు సంబంధించిన వైద్యులకు సొంతంగా ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు ఉండడం వల్ల విధులకు డుమ్మా కొడుతున్నారని పలువురు సభ్యులు సమావేశంలో ఆరోపించారు. కేశంపేట, శంషాబాద్, నందిగామ ప్రాంతాల్లో కొంతమంది డాక్టర్లు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారని, ప్రైవేటు ప్రాక్టీస్ వల్ల విధులకు సైతం సరిగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దవాఖానలలో పాము కాటుకు మందులు సైతం అందుబాటులో లేకపోతే ఎలా? అని తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ సమావేశం దృష్టికి తెచ్చారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆపరేషన్ థియేటర్లలో ఏసీలు, ఇతర వసతులు, సదుపాయాలు ఉండేలా చూడాలని కోరారు. ఉన్నతాధికారులు ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్ అధికారులను కోరారు. విద్యా, వైద్యశాఖల్లో ఇంటర్నల్ డిప్యుటేషన్ల రద్దుకై సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నట్లు జడ్పీ చైర్పర్సన్ అనితాహరినాథ్‌రెడ్డి చెప్పగా.. కలెక్టర్ స్పందిస్తూ.. డిప్యూటేషన్లు శాఖాపరమైన నిర్ణయమని, రాష్ట్ర స్థాయిలో కూడా దీనిపై ఓ నిర్ణయం తీసుకునేలా సభ్యులు చొరవ చూపాలని సూచించారు.
ప్రతి ఆరోగ్య కేంద్రంలోనూ కచ్చితంగా డాక్టర్లు, సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని, వైద్యశాఖపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తామని సభ్యులకు హామీ ఇచ్చారు.
ప్రైవేటు స్కూళ్లల్లో అడ్డగోలుగా ఫీజు వసూలు..
ప్రైవేటు స్కూళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని సభ్యులు సమావేశంలో ఆరోపించారు. యూనిఫామ్స్ కొనాలని ఒత్తిడి తేవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని సమావేశం దృష్టికి తెచ్చారు. చేవెళ్ల మండలం గౌరాయపల్లిలో ప్రభుత్వ పాఠశాలను గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్నారని, కొన్నిసార్లు చెట్ల కింద కూర్చోబెట్టి విద్యా బోధన చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అక్కడి ఎంపీపీ అధికారుల దృష్టికి తెచ్చారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీఈవో సుశీందర్‌రావుకు సూచించారు. యాచారంలోని ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం నిర్వాకం వల్ల ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకమవుతున్నదని, ఆ పాఠశాలకు అనుమతులు ఇవ్వవద్దని ఎంపీపీ కోరగా.. క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని డీఈవో హామీ ఇచ్చారు. పాఠశాలల కొరత ఉన్నచోట్ల పారా టీచర్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు కోరారు. పాఠశాలలు తెరిచే నాటికి పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్స్ అందుబాటులో ఉంచాలన్నారు.
పోడియం ముందు నిరసన..
కడ్తాల్ మండలంలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా పాఠశాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కడ్తాల్ జడ్పీటీసీ దశరథ్ నాయక్ చైర్పర్సన్ పోడియం ముందు కింద కూర్చొని నిరసన తెలిపారు. రూ.6 లక్షలు డీడీ కట్టినప్పటికీ తాత్సారం చేస్తున్నారని, అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. గాలివానలకు విద్యుత్ అంతరాయం జరుగుతున్నప్పటికీ ఏఈలు, లైన్మన్లు స్పందించడం లేదని పలువురు సభ్యులు సభ దృష్టికి తెచ్చారు.
సమావేశంలో ప్రస్తావించిన మరిన్ని సమస్యలు..
- ప్రస్తుతం తాగునీటి కొరత లేదని, వాల్స్, కంట్రోల్ వాల్స్ లేక, నిర్వహణ సరిగా లేని కారణంగా తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని షాద్‌నగర్ వీర్లపల్లి శంకర్ మిషన్ భగీరథ అధికారులను ఉద్దేశించి అన్నారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
- నకిలీ విత్తనాలు, ఎరువులతో రైతులకు ఇబ్బందులు కలుగకుండా వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాలని సభ్యులు కోరగా.. జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి గీతారెడ్డి స్పందిస్తూ.. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులందరం కలిసి తనిఖీలు నిర్వహించి పర్యవేక్షించడం జరుగుతున్నదని తెలిపారు.
- గడిచిన ఐదేండ్లలో సుదీర్ఘ సమీక్షలను నిర్వహించడం జరిగిందని, ప్రజా సమస్యలను ప్రస్తావించి తీర్మానాలు చేశామని జడ్పీ చైర్పర్సన్ అనితాహరినాథ్‌రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ పేర్కొన్నారు. జిల్లాలో ఎంపీడీవోలు, నోడల్ అధికారులతో సమస్యలపై చర్చించి పరిష్కారం చూపడం జరిగిందన్నారు. ఐదేండ్లుగా సహకరించిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
- ఇటీవల కన్నుమూసిన రామోజీరావు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు సమావేశం సంతాపం తెలిపింది. సభ్యులు, అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

