కాక్రోచ్ల శాంతి, మోదీ హింస!
భారతదేశ ప్రజలకు, ప్రపంచానికి ఒక విషయం ఈ సరికి స్పష్టమైపోయింది. కాక్రోచ్లది పూర్తిగా శాంతిమార్గం. మోదీ ప్రభుత్వానికి పూర్తి హింసామార్గం. ఈ విషయాన్ని దేశ విదేశాల్లోని వ్యాఖ్యాతలు అనునిత్యం ఎత్తిచూపుతుండగా, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థ సైతం అసాధారణ రీతిలో కేవలం పన్నెండు రోజుల్లో మూడుసార్లు ఇక్కడ హక్కుల అణచివేత గురించి మాట్లాడింది.
భారతదేశ ప్రజలకు, ప్రపంచానికి ఒక విషయం ఈ సరికి స్పష్టమైపోయింది. కాక్రోచ్లది పూర్తిగా శాంతిమార్గం. మోదీ ప్రభుత్వానికి పూర్తి హింసామార్గం. ఈ విషయాన్ని దేశ విదేశాల్లోని వ్యాఖ్యాతలు అనునిత్యం ఎత్తిచూపుతుండగా, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థ సైతం అసాధారణ రీతిలో కేవలం పన్నెండు రోజుల్లో మూడుసార్లు ఇక్కడ హక్కుల అణచివేత గురించి మాట్లాడింది. మోదీ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ దీనినంతా నిరాకరిస్తూనే, మరొకవైపు తన అణచివేతలను యథాప్రకారం కొనసాగిస్తున్నది. ఇదొక క్లాసిక్ నియంతృత్వం వంటిది. అకడమిక్ పరిభాషలో చెప్పాలంటే ‘ఎన్నికైన నియంతృత్వం’ (ఎలెక్టెడ్ ఆటోక్రసీ) అన్నమాట. ఈ తరహా వ్యవస్థల్లో ఎన్నికలు జరుగుతాయి. స్వేచ్ఛగా కావచ్చు, కాకపోవచ్చు కానీ జరుగుతాయి. ‘సర్’ వంటి ప్రక్రియ ద్వారా నకిలీ ఎన్నికలు అయినా సరే. అప్పుడది నామ్ కే వాస్తే ప్రజాస్వామ్య ప్రక్రియగా ఒక తంతు అవుతుంది. అది ఎలెక్టెడ్ ఆటోక్రాట్స్కు ఒక ముసుగుగా మారుతుంది. ఎన్నికైన అనంతరం వారి నియంతృత్వ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది.
నియంతృత్వ ప్రయోజనాల్లో మూడు అంశాలుంటాయి. కనీసం మోదీకి సంబంధించి అట్లా ఉన్నాయి. ఒకటి, తన సొంత అధికారం. రెండు, తనను బలపరచే, తాను కూడా తోడ్పాటునిచ్చే ఆర్థికవర్గాల అవసరాలు. మూడు, తన సైద్ధాంతిక భూమి అయిన సంఘ్ పరివార్ లక్ష్యాలు ముందుకుపోవటం. ఈ మూడింటిని శాంతియుత పద్ధతుల్లో కూడా నెరవేర్చుకోవచ్చు. కానీ ఒక్కోసారి హింసాత్మకంగా ఆ పని చేయవలసి వస్తుంది. సమాజంలో చైతన్యాలు పెరిగి, ఈ తరహా ప్రణాళికలకు ప్రతిఘటన ఎదురైనప్పుడు. ప్రస్తుతం కాక్రోచ్ల విషయమై మోదీ ప్రభుత్వం చేస్తున్నది. అట్లా చేయడానికి కారణం, మోదీ ప్రభుత్వానికి అంతన్నా మార్గాంతరం లేకుండాపోయింది. ఇంగ్లీషులో ‘పెయింటింగ్ వన్ సెల్ఫ్ ఇన్ టు ఏ కార్నర్’ అనే మాట ఉన్నది. అనగా ఒక మనిషి ఒక గది నేలకు రంగు వేయడం ఒక మూలన మొదలుపెట్టి గుమ్మం వైపు వెళ్లడానికి బదులు, గుమ్మం దగ్గర మొదలై ఒక మూలకు వెళ్లడమన్నమాట. అప్పు డు ఆ మూలన చిక్కుకుని ఎట్లా బయటకు వెళ్లా లో తెలియకపోవటం వంటిది. మోదీ కూడా అ టువంటి మార్గాంతరంలేని స్థితిని తానే సృష్టించుకున్నారు. ఆ స్థితిని యువతరం, సమాజం ఎత్తిచూపడం ఆయనకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నది. అది సమస్య పరిష్కారం కాదు. అయినా ఆగ్రహావేశంతో కాక్రోచ్‌లపై హింసకు పాల్పడుతున్నారు.
పలు విధాలుగా విఫలమవుతున్న మోదీ పార్టీకి, సంఘ్ పరివార్‌కు ఆందోళన మొదలైంది 2024 ఎన్నికల్లో సీట్లు తగ్గడమే గాక సొంత మెజారిటీ రాకపోవడంతో. ఆ విధంగా తనను బలపరిచే ఆర్థికవర్గాలకు కూడా కలవరపాటు కలిగింది. ఆ విధంగా ‘సర్’ పన్నాగాలు మొదలయ్యాయి. ఆ పేరిట జరుగుతున్న దారుణాలు వెలుగులోకి వస్తూ నిరసనలు మొదలుకాగా, కాక్రోచ్లు కూడా ముందుకు రావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం, అది అణచివేతలకు దారితీయడం తెలిసిందే. ఆందోళనలు, అణచివేతలు తరచూ జరుగుతుండేవే. ఈ సారి ఒక ముఖ్యమైన తేడా కనిపిస్తున్నది. ఇతరత్రా ఉద్యమకారులకు భిన్నంగా అభిజీత్ దీప్కే నాయకత్వాన సీజేపీ, తమది పూర్తిగా శాంతియుత ఉద్యమమని మొదటిరోజు నుంచి పదేపదే నొక్కి చెప్తున్నది.
సాధారణంగా యువతరానికి ఆగ్రహావేశాలు ఎక్కువ. హింసకు కూడా పాల్పడుతుంటారు. అయినప్పటికీ జంతర్ మంతర్ వద్ద వారాల తరబడి వేలాదిమంది రాత్రింబవళ్లు చేరినా, వారివైపు నుంచి చిన్న హింసాత్మక చర్య కూడా చోటు చేసుకోలేదు. తమది గాంధీ మార్గమని, శాంతియుత ఉద్యమమని ప్రతిరోజూ విసుగు లేకుండా ప్రకటిస్తుండిన సీజేపీ నాయకత్వం వారిని అట్లాగే నియంత్రించి అహింసా స్ఫూర్తిని కలిగించింది కూడా.
అది అసాధారణమైనది. అందుకే దేశ విదేశాల్లో గుర్తింపును, గౌరవాన్ని పొందింది. సామాజికులు మెచ్చారు. ఇంతవరకు ఏ ఉద్యమాల్లో లేనంతగా యువతులు సైతం పెద్దఎత్తున ధైర్యంగా కదలివచ్చారు. వారిలో ఎందరెందరో దూరప్రాంతాల నుంచి, తల్లిదండ్రులకు చెప్పనైనా చెప్పకుండా. పోలీసుల అణచివేత, దుర్భాషలు, అసభ్య ప్రవర్తనలకు వెరవకుండా. కాక్రోచ్ల నాయకత్వం శాంతియుత ఉద్యమమంటూ ప్రకటించడానికి కారణాలున్నాయి. సీజేపీ అగ్రనాయకులైన అభిజీత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్‌దాస్ ఉన్నత విద్యావంతులు. లోగడ ఆమ్ ఆద్మీ పార్టీలో పని చేసినప్పుడు ప్రభుత్వపు హింస గురించి దేశంలో వివిధ ఘటనలను గమనించారు. ఉద్యమకారులు హింసా చర్యలకు పాల్పడితే పోలీసులకు అణచివేతలు, కేసులు, వేధింపులు మరింత తేలికవుతాయని గమనించారు. తామిప్పుడు తలపెడుతున్న కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా యువకులతోపాటు యువతులకు సంబంధించినవి కూడా అయినందున వారిని సమీకరించాలంటే శాంతియుత మార్గమే సరైనదన్న అభిప్రాయానికి వచ్చారు. ఇతరత్రా కూడా, మొదటి నుంచి గాంధీజీని ప్రస్తావిస్తున్న ఆ ముగ్గురికి శాంతిమార్గమే అనుసరించదగినదనే నమ్మకం కలిగింది. కనుకనే జంతర్ మంతర్ వద్ద ఆ ప్రకారం వ్యవహరించారు. పోలీసులు యువతులు సహా ఎవరిపై ఎంత దమనకాండకు పాల్పడినా భరించారు, శాంతియుతంగా నిరసించారే తప్ప, అన్ని వారాల కాలంలో ఒక్క రాయి కూడా విసరకపోవడం దేశ ఉద్యమాల చరిత్రలో అపూర్వమైనది.
మోదీ ప్రభుత్వం వారి డిమాండ్‌ను అంగీకరించినా లేకున్నా యువతరం క్రమశిక్షణను గుర్తించి ప్రశంసించవలసింది. తను కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవలసింది. ఆ పని చేయకపోగా పోలీసుల ద్వారా క్రూరంగా వ్యవహరించింది. మగపిల్లలు, ఆడపిల్లలనే తేడా లేకుండా హింసను ప్రయోగించింది. ఆడ పోలీసులతోనూ హింస జరిపించింది. మరింత ధూర్తమైన పనేమిటంటే, యువతుల పట్ల మగ పోలీసు అధికారులు, ఆడ పోలీసులు రౌడీల వలె దుర్భాషలాడుతూ, శారీరకమైన అసభ్య ప్రవర్తనకు దిగజారారు. ఆ భాష, చర్యలు రికార్డు అవుతూ సోషల్ మీడియా ద్వారా దేశ విదేశాలకు చేరి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నా, ఎన్ని విమర్శలు వస్తున్నా సిగ్గుపడక, వెరవక, అవే చర్యలు కొనసాగించారు. చివరికి ప్రైవేట్ రౌడీలనూ రంగంలోకి దించారు. దానిని బట్టి, మోదీ ప్రభుత్వం పోలీసులను ఎంతగా హింసకు ఉసిగొల్పిందో అర్థం చేసుకోవచ్చు. అంతకుమించి గ్రహించవలసింది, అట్లా హింసకు ఉసిగొల్పటానికి కారణం ఏమై ఉంటుందన్నది. అది గ్రహించడం కష్టంకాదు. ఆయన ప్రభుత్వం కాక్రోచ్లు లేవనెత్తిన అంశాలు, ఉద్యమంతో, అందుకు దేశవ్యాప్తంగా యువతరం నుంచేగాక సమాజం నుంచి వస్తుండిన అనూహ్యమైన స్పందనలతో భయకంపితమైంది. ఓటర్ జాబితాల సవరణ కుంభకోణం ముందుకు వచ్చే సరికి ఆ భయం తారస్థాయికి చేరింది. ఆ అంశం అసలు తమ అధికారాన్నే తలకిందులు చేయగలది. అది ఏ విధంగానో ఇప్పటికే వెల్లడి అయినందున మళ్లీ రాయనక్కరలేదు. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనగల ఏకైక మార్గం హింస అనేది మోదీ ఎంచుకున్న మార్గం. ‘మాతో చర్చలు ఎందుకు జరపరు?’ అని కాక్రోచ్ నాయకులు పలుమార్లు కోరినా స్పందించనిది అందువల్లనే. అదే ఎన్నికైన నియంతృత్వపు నికార్సయిన ధోరణి.
మోదీ ప్రభుత్వం హింసా విధానం పోలీసు బలగాల వినియోగరూపంలో మాత్రమే కనిపించడంలేదు. శాంతియుత ప్రదర్శనకారులపై నిర్హేతుకమైన రీతిలో కేసులు బనాయించే తీరుకూడా హింసే. ముంబయి నుంచి వచ్చిన సీజేపీ నాయకులను విమానం నుంచే లాగి నిర్బంధించిన దృశ్యాల వంటివి ఎప్పుడూ చూడని దేశ ప్రజలు, ఇతర దేశాలవారు నిర్ఘాంతపోయారు. వారిని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ల ముందుగాక పోలీస్ మెజిస్ట్రేట్ల ఎదుట హాజరుపరిచి శాంతి బాండ్లపై సంతకాలు చేయించడం కూడా హింసా పద్ధతే.
శాంతి పేరిట, ఉద్యమకారులు అసలు తమ రాజ్యాంగబద్ధ నిరసన హక్కులను సైతం వదలుకునేట్టు చేయడమంటే ఏమిటి? ఎటువంటి హింసకు పాల్పడకుండా జాతీయ పతాకాలతో శాంతియుత ప్రదర్శనలు జరపడాన్ని కూడా మోదీ ప్రభుత్వం హింసగా చిత్రీకరిస్తున్నదంటే, స్వయంగా తానే ఎటువంటి హింసకు పాల్పడుతున్నదో దేశమంతా, ప్రపంచమంతా గమనిస్తున్నది. ఆ విధంగా ‘విశ్వగురు’ నిజస్వరూపం అందరికీ బహిర్గతమైపోయింది. మోదీ అంతిమ భయం ఒకే ఒకటి. ఈ పరిణామాలు తన అధికార భ్రష్టత్వానికి ఎక్కడ దారితీస్తాయోనని. కనుక ఎటువంటి హింసకైనా వెనుకాడరాయన. రాగల కాలంలోనూ ఇదే పని చేయగలరనడంలో సందేహం ఉండనక్కరలేదు.
టంకశాల అశోక్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

