ఆర్మూర్‌టౌన్, ఫిబ్రవరి 7: ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఓటర్లను కోరారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో ఆయన శనివారం పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన వినిపించారు.
కాంగ్రెస్ పాలన ఎవరికీ నచ్చడం లేదని, దీంతో పట్టణంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజా, కుల సంఘాల వారు నిత్యం పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. రోజురోజుకూ కారు జోరు మరింత పెరుగుతున్నదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆయనవెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.