Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కి ముంబయిలో విజయవంతంగా భుజం శస్త్రచికిత్స జరిగింది. కొంతకాలంగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు శనివారం ప్రముఖ వైద్యుల బృందం సుమారు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. వైద్యుల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ కుడి భుజంలోని రొటేటర్ కఫ్ కండరాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు అవల్షన్ ఫ్రాక్చర్ కూడా గుర్తించారు. గతంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో రెండు భుజాలకు గాయాలు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, ముందుగా కుడి భుజానికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు.
ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్ అనంతరం పవన్ కళ్యాణ్‌ను రికవరీ రూమ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన అనస్థీషియా ప్రభావం నుంచి కోలుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటనలో, శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతో పాటు అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో శస్త్రచికిత్స నిర్వహించాల్సి వచ్చింది. వైద్యుల బృందం ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని పేర్కొంది.
పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో రాజకీయ, సినీ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం సంతోషకరం. ఆయన పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకుని ప్రజాసేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ఆయ నకు మానసిక ధైర్యం కలగాలని కోరుకుంటున్నాను అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.ఇక జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.