హైదరాబాద్ : పశిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. ట్రంప్ హెచ్చరికలను లెక్కచేయకుండా అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ఇరాన్ (Iran) ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ అణుకర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో విరుచుకపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌లోని అణు పరిశోధన కేంద్రం సమీపంలోని డిమోనా, అరద్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడుల్లో సుమారు వంద మంది స్థానికులు గాయపడినట్లు, అందులో చిన్నారులు సైతం ఉన్నారని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. అయితే ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని ఐఏఈఏ తేల్చి చెప్పింది.
కాగా, ఇరాన్‌పై మరోసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald trump) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లోగా ఇరాన్ ఎటువంటి బెదిరింపు లేకుండా హర్మూజ్ జలసంధిని(Hormuz )తెరవకపోతే, ఆ దేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా మరోసారి పోస్ట్ చేశారు. కాగా, అంతకుముందు ట్రంప్ చేసిన ప్రకటన రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేసింది. ట్రూత్ సోషల్ వేదికగా డోనాల్ట్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ ద్వారా తమ లక్ష్యాలకు చేరువైనట్లు ఆయన వెల్లడించారు. ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్య గురించి ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు.
ఇరాన్‌కు చెందిన క్షిపణి సామర్థ్యం, లాంచర్లు, ఇతర ఆయుధాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇరాన్ ఇండస్ట్రియల్ బేస్‌ను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆ దేశ నేవీ, ఎయిర్ ఫోర్స్‌ను కూడా దెబ్బతీశామన్నారు. యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ ఆయుధాలను కూడా ధ్వంసం చేశామన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీశామన్నారు. పశ్చిమాసియాలోని తమ మిత్ర దేశాలను రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు.
ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ ఇతర దేశాల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. కీలకమైన హోర్ముజ్ జలసంధికి రక్షణ ఏర్పాటు చేయాలని, ఆ జలసంధిని వినియోగించే దేశాలు దానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ ఎవరికైనా ఈ అంశంలో సహాయం అవసరమైతే తాము ఆ దేశాలను ఆదుకోనున్నట్లుచెప్పారు. తాము చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ పట్ల శ్రద్ధ చూపిన వారికి థ్యాంక్స్ చెబుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడి చేసిన అమెరికా తన మిలిటరీ ఆపరేషన్‌ను నిలిపివేయాలనుకుంటునున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలా తీవ్ర వాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.