కుడి చేతికి సర్జరీ కావడంతో రెండు వారాల పాటు షూటింగ్‌కు గ్యాప్ తీసుకున్నారు చిరంజీవి. తిరిగి సోమవారం ఆయన కెమెరా ముందుకొచ్చారు. ‘గాడ్‌ఫాదర్’ షూటింగ్‌ను మొదలుపెట్టారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకాలపై ఆర్.బి.చౌదరి, ఎన్వీప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహన్‌రాజా దర్శకుడు. సోమవారం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఇందులో చిరంజీవిపై కీలకమైన పోరాట ఘట్టాలను చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం మొత్తం పాల్గొననున్నారు. ‘పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రమిది. చిరంజీవి పాత్ర శక్తివంతంగా ఉంటుంది’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: నీరవ్ షా.