Chicken Shops : తెలంగాణ రాష్ట్రం (Telangana State) లో మాంసం ప్రియుల (Meat Lovers) కు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించి తమను నష్టాలకు గురిచేస్తున్నాయంటూ రాష్ట్రవ్యాప్తంగా బంద్ పాటించాలని తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఇప్పటికే బంద్‌కు మద్దతు ప్రకటించారు.
ఘట్కేసర్లోని గురుకుల్ కళాశాల మైదానంలో శనివారం చికెన్ సెంటర్ల నిర్వాహకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పౌల్ట్రీ కంపెనీలు తమకు రావాల్సిన మార్జిన్‌ను ఏకపక్షంగా తగ్గించి తమను నష్టాలపాలు చేస్తున్నాయని ఆరోపించారు. దీనివల్ల వ్యాపారం చేయడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. తగ్గించిన మార్జిన్‌ను తిరిగి సవరించి, తమకు న్యాయం చేసేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టంచేశారు. ఈ బంద్‌లో రాష్ట్రంలోని అన్ని చికెన్ సెంటర్ల యజమానులు పాల్గొంటారని తెలిపారు.