Kunar Hembram: లోక్సభ ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఝార్గ్రామ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ కునార్ హెంబ్రామ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన ఝార్గ్రామ్ జిల్లా అధ్యక్షుడికి తన రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాలవల్లే తాను పార్టీని వీడుతున్న తన రాజీనామా లేఖలో హెంబ్రామ్ పేర్కొన్నారు.
బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక ముందు తాను రాజకీయాల్లో కొనసాగాలని అనుకోవడం లేదని, అందుకే రాజీనామా చేశానని చెప్పారు. తన స్థానంలో మరొకరు అవకాశం దక్కించుకోవడానికి ఇదే సరైన సమయమని భావించి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తన రాజీనామా లేఖను ఆమోదించారా.. లేదా..? అనేది ఇంకా తెలియదని చెప్పారు.
బీజేపీకి రాజీనామా చేసిన మీరు వేరే ఏదైనా పార్టీలో చేరుతున్నారా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, తాను ఏ పార్టీతో టచ్లో లేనని అన్నారు.