కోల్కతా: ఇటీవల కోల్కతాలో జరిగిన ఓ నకిలీ వ్యాక్సినేషన్ క్యాంపులో తృణమూల్ ఎంపీ మిమి చక్రవర్తి టీకా తీసుకున్న విషయం తెలిసిందే. ఆ క్యాంపు గుట్టు విప్పింది కూడా ఆమే. అయితే ఆ క్యాంపులో టీకా తీసుకున్న తర్వాత ఎంపీ మిమి చక్రవర్తి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రంగా కడుపు నొప్పి వస్తున్న నేపథ్యంలో ఆమె ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. కోల్కతాలోని కస్బా ప్రాంతంలో నకిలీ వ్యాక్సినేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు. అక్కడ టీకా తీసుకున్న ఎంపీ మిమి.. ప్రస్తుతం పిత్తాశయం(గాల్ బ్లాడర్) సమస్యతో బాధపడుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అంటూ క్యాంపు నిర్వహించిన దేబాంజన్ దేబ్ను పోలీసులు అరెస్టు చేశారు. రెండు చోట్ల దేబ్ నకిలీ వ్యాక్సిన్ క్యాంపులు పెట్టినట్లు తెలుస్తోంది. టీకా తీసుకున్న తర్వాత ఎంపీ మిమికి ఎటువంటి మెసేజ్ రాలేదు. టీకా వేసే ముందు ఆధార్ నెంబర్ కూడా తీసుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన ఎంపీ మిమి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.