Iran Attacks : గల్ఫ్ దేశాల (Gulf states) పై ఇరాన్ (Iran) క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్నది. క్షిపణి శకలాలు మీద పడి యూఏఈ (UAE) లోని అబుదాబి (Abu Dhabi) లో ఐదుగురు భారతీయులు (Indians) గాయపడ్డారు. అబుదాబిలోని అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇదిలావుంటే తమవైపు దూసుకొచ్చిన ఓ బాలిస్టిక్ క్షిపణిని గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని, యూఏఈ (UAE) రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొన్నది.
క్షిపణి శకలాలు కెజాద్లోని రెండు ప్రాంతాల్లో పడటంతో పెద్దఎత్తున మంటలు చెలరేగినట్లు యూఏఈ డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నది. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఐదుగురు భారతీయులు గాయపడ్డారని, ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది.
కాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకి మరింత పెరుగుతున్నాయి. అమెరికా- ఇజ్రాయెల్ దేశాలకు, ఇరాన్‌కు మధ్య కొనసాగుతున్న యుద్ధంలోకి తాజాగా హౌతీలు కూడా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. శనివారం యెమెన్ నుంచి ఓ క్షిపణి తమదేశం వైపు దూసుకొచ్చిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పేర్కొన్నది. ఇరాన్‌కు మద్దతుగల హౌతీలు దక్షిణ ఇజ్రాయెల్ పైకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించాయని, తమ వైమానిక రక్షణదళాలు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయని తెలిపింది.
అయితే ఆ బాలిస్టిక్ క్షిపణ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఐడీఎఫ్ వెల్లడించింది. ఇదిలావుంటే ఈ దాడి తామే చేశామని హౌతీలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.