హైదరాబాద్, మే 4 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పేరున్న నాయకులు లేరు. బలమైన రాజకీయ క్యాడర్ అంతకన్నా లేదు. అయితే ఏంటీ?? తమిళ రాజకీయాల్లో ఏండ్లుగా వేళ్లూనుకొన్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను 27 నెలల వయసున్న ఓ పార్టీ మట్టికరిపించింది. ఆ పార్టీకి కర్త, కర్మ, క్రియ ఒక్కడే. అతడే తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత, దళపతి విజయ్. సోమవారం విడుదలైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పెను ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తారుమారు చేస్తూ.. 107 స్థానాల్లో విజయ దుందుభి మోగించి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది.
ఫిబ్రవరి 2, 2024లో ‘తమిళిగ వెట్రి కళగం’ పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్.. రాజకీయాలంటే తనకు వృత్తి కాదని, ప్రజా సేవ చేసే పవిత్రమైన పని అంటూ తొలి ప్రసంగంలోనే తన సునిశిత మాటలతో ప్రజల మనసు చూరగొన్నారు. తన సినిమాల ద్వారా జెన్ జీలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించిన విజయ్.. వాటిని ఓట్లుగా మార్చడంలో సఫలీకృతమయ్యారు. ఇదే సమయంలో మహిళలను, యువతను ఆకట్టుకోవడానికి ఇచ్చిన డీజిల్‌పై సబ్సిడీ, బీమా, రూ. 25 లక్షల వరకూ విద్యా రుణాలు, మహిళలకు రూ. 2,500 ఆర్థిక సాయం, ఏడాదికి ఆరు ఫ్రీ సిలిండర్లు, అమ్మాయిలకు పెండ్లి కానుకగా 8 గ్రాముల బంగారం, మత్స్యకారులకు రిలీఫ్ ఫండ్ వంటి ఎన్నికల హామీలు ఓటర్లను మరింత దగ్గర చేశాయి.

తమిళనాట విజయ్ విక్టరీ అంత తేలిగ్గా ఏమీ సాధ్యంకాలేదు. ఆరంభంలోనే విజయ్ను వివాదాలు చుట్టుముట్టాయి. నిరుడు సెప్టెంబర్‌లో కరూర్‌లో ఆయన ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించడం, గత ఫిబ్రవరిలో విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించడం కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టాయి. ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీలు ఈ అంశాలనే ఎత్తిచూపుతూ విమర్శలు గుప్పించాయి.
సినిమా స్టార్లు రాజకీయాల్లో రాణించలేరన్న అపవాదును చెరిపివేస్తూ విజయ్ తన సినీ పాపులారిటీని ఓట్లుగా రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. తద్వారా ఎంజీ రామచంద్రన్, జయలలిత వంటి దిగ్గజాల సరసన చేరారు. 1977 తర్వాత డీఎంకే, అన్నాడీఎంకే కాకుండా మరో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయడం ఇదే తొలిసారి.
జోసెఫ్ విజయ్ జూన్ 22, 1974లో చెన్నైలో పుట్టారు. తండ్రి ఎస్ఏ చంద్రశేఖరన్ సినిమా దర్శకుడు. తల్లి శోభ గాయని. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో విజయ్‌కు చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి నెలకొన్నది. దీంతో విజువల్ కమ్యూనికేషన్లో చేస్తున్న డిగ్రీని మధ్యలోనే ఆపేసి షూటింగ్‌లు, ఆడిషన్స్‌కు వెళ్లడం ప్రారంభించారు. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే సినిమాల ద్వారా యువతలో మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్నారు. తన ఫ్యాన్స్ అసోసియేషన్స్ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలను కొనసాగించారు.
2009లో 85 వేల ఫ్యాన్ క్లబ్‌లను ‘విజయ్ మక్కల్ ఇయక్కమ్’ పేరిట ఓ సంక్షేమ సంఘంగా విజయ్ ఏకీకృతం చేశారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమికి వీఎంఐ మద్దతు ఇవ్వడంతో విజయ్ పరోక్షంగా రాజకీయాల్లోకి వచ్చినట్లయ్యింది. 2021-22లో జరిగిన స్థానిక ఎన్నికల్లో విజయ్ మద్దతుదారులు పోటీచేసిన 169 స్థానాల్లో ఏకంగా 115 చోట్ల విజయం సాధించారు. దీన్ని గమనించిన విజయ్ సన్నిహితులు రాజకీయాల్లోకి రావాలని ఆయనకు సలహానిచ్చారు. ఆత్మీయుల సలహాతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ‘టీవీకే’ను స్థాపించిన విజయ్.. తొలి ఎన్నికల్లోనే విజయ దుందుభి మోగించారు.
ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ సంస్థలో ఇదివరకు పని చేసి.. ఎన్నికల వ్యూహాలను ఔపోసన పట్టిన కపిల్ సాహూ.. టీవీకేకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. విజయ్ ప్రచార సందేశాలను రూపొందించడం, గ్రామీణ స్థాయి కార్యకలాపాలను సమన్వయం చేయడం, ఓటర్ల డాటా విశ్లేషణ, సంక్షేమ పథకాల రూపకల్పన ఇలా తన 12 మంది బృందంతో కపిల్.. టీవీకేకు సరైన మార్గనిర్దేశం చేశాడు. పదేండ్ల అనుభవం ఉన్న కపిల్.. గతంలో ఎస్డీఎఫ్, ఆప్, కాంగ్రెస్ పార్టీకి కూడా ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు 118 కాగా, టీవీకే 107 స్థానాలను గెలుచుకొన్నది. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 11 సీట్లు అవసరం. దీంతో టీవీకే వర్గాలతో కాంగ్రెస్, లెఫ్ట్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఫలితాలు వెల్లడువుతన్న వేళ.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ కలిసి రావాలని విజయ్ తండ్రి చంద్రశేఖర్ పిలుపునిచారు. అటు అన్నాడీఎంకే వర్గం కూడా విజయ్‌తో సమాలోచనలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
