పాట్నా, ఏప్రిల్ 14 : బీహార్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు దశాబ్దాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్రతిహతంగా పాలన సాగిస్తున్న సీఎం నితీశ్‌కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. నితీశ్ రాజ్యసభకు వెళ్లడంతో ముఖ్యమంత్రి రేసులో సమ్రాట్ చౌధరీ పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. మంగళవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం విజయ్‌కుమార్ సిన్హా , బీజేపీ సీనియర్ నేత మంగళ్‌పాండే తదితరులు సమ్రాట్ చౌధరీ పేరును ప్రతిపాదించడంతో పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
బుధవారం లోక్‌భవన్‌లో చౌధరీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రముఖ ఓబీసీ నేత అయిన సమ్రాట్ చౌధరీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. బీహార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి బీజేపీ నేతగా ఆయన నిలువనున్నారు. 1990లో ఆర్జేడీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. అనంతరం జేడీయూలో చేరారు. 2017లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.