న్యూఢిల్లీ, జూన్ 23 : ఏఐ చుట్టూ తన వ్యాపారాన్ని పునర్నిర్మించుకుంటున్న అమెరికన్ టెక్ దిగ్గజం ఒరాకిల్ 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 21,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. సంస్థ తాజా నివేదిక ప్రకారం ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్య 13 శాతం పడిపోయింది. గత ఏడాది సంస్థలో దాదాపు 1,62,000 మంది ఉద్యోగులు ఉండగా 2026 మే 31 నాటికి ఆ సంఖ్య 1,41,000కు క్షీణించింది. మార్పు ఇక్కడితో ఆగదని ఒరాకిల్ చెబుతున్నది. తన కార్యకలాపాల్లో విస్తృతంగా ఏఐ టెక్నాలజీలను ప్రవేశపెట్టిన కారణంగా ఉద్యోగుల సంఖ్య తగ్గిందని, భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ కోతలు అనివార్యమని సోమవారం విడుదల చేసిన తన వార్షిక నివేదికలో కంపెనీ పేర్కొన్నది.
నిర్వహణ, ఉత్పత్తి మార్పులు, పనితీరు అంశాలు, వ్యూహాత్మక మార్పులు, సేకరణలు తదితర అనేక అంశాల ఆధారంగా ఉద్యోగుల సంఖ్యలో సర్దుబాట్లు ఉంటాయని కంపెనీ పేర్కొన్నది. భారీ మార్పులు ఉంటాయని కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలోనే సూచనలు అందచేసింది. ఏఐ డాటా సెంటర్ భారీ విస్తరణ కార్యక్రమం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఒరాకిల్ వేలాది ఉద్యోగుల్లో కోత విధించే ఆలోచనను మార్చిలో ప్రకటించింది. ఒరాకిల్ ఇక కేవలం డాటాబేస్ సాఫ్ట్వేర్ కంపెనీ కాదు.