కెనడాకు చెందిన భారతీయ సినీ నిర్మాత లీనా మణిమేకలై కొద్దిరోజుల క్రితం కాళీ డాక్యుమెంటరీ ప్రమోషనల్ పోస్టర్లో కాళీదేవిని అసభ్యకరంగా చిత్రీకరించి, ట్విటర్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి హిందువులనుంచి తీవ్ర అభ్యంతరాలను ఎదుర్కొంటున్నది. ఈ విషయంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే సందేశాలకు చెక్ పెట్టాలని కోరుతూ ట్విట్టర్‌కు లేఖ రాస్తానని తెలిపారు.
కొందరు వ్యక్తులు హిందూ దేవుళ్లను, దేవతలను కించపరిచేలా చిత్రీకరించడాన్ని తాను తీవ్రంగా పరిగణిస్తున్నానని నరోత్తమ్ మిశ్రా తెలిపారు. అలాగే, వివాదాస్పద పోస్టర్‌ను ట్వీట్ చేసిన లీనా మణిమేకలైపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాస్తుందని మిశ్రా వెల్లడించారు.