కోల్‌కతా: బైక్‌లపై వచ్చిన కొందరు వ్యక్తులు సీనియర్ వామపక్ష నేత ఇంటిపై మద్యం సీసాలు విసిరారు. దీంతో కిటికీ అద్దాలు, సీసీటీవీ కెమెరాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై ఆ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ గూండాల పనిగా ఆయన ఆరోపించారు. (Bottles Thrown At Leader’s House) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం 5 గంటల సమయంలో సీపీఎం సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు బికాష్ రంజన్ భట్టాచార్య ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. బైక్‌లపై వచ్చిన ఆ వ్యక్తులు మద్యం సీసాలను ఆయన ఇంటిపైకి విసిరారు. కిటికీ అద్దాలు పగులగొట్టడంతోపాటు సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేశారు.
కాగా, తనకు పెద్ద శబ్దం వినిపించిందని రంజన్ భట్టాచార్య తెలిపారు. తన ఇంట్లో పనిచేసే వ్యక్తి తనను పిలువడంతో బయటకు వచ్చి చూసినట్లు చెప్పారు. తన ఇంటిపైకి మద్యం సీసాలు విసిరి కిటికీ అద్దాలు పగులగొట్టిన దుండగులు తమతో పెట్టుకోవద్దని తనను బెదిరించినట్లు ఆయన ఆరోపించారు. బీజేపీ మద్దతు ఉన్న గూండాలు ఈ దాడి చేసినట్లు విమర్శించారు. ‘హిందుత్వ మద్దతుదారులు నా ఇంటిపై దాడి చేశారు. ఉగ్రవాదులు ఇలాగే దాడి చేస్తారు. ముఖాలు కప్పుకుని. నేను హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా నిరంతరం మాట్లాడుతున్నందుకే ఈ దాడి జరిగింది’ అని ఆయన అన్నారు. ఈ సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు, తాను ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నానని రంజన్ భట్టాచార్య తెలిపారు. రివాల్వర్ లైసెన్స్ కోసం పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేస్తానని చెప్పారు. ‘నేను లైసెన్స్ ఉన్న రివాల్వర్‌ను వెంట ఉంచుకోవాలనుకుంటున్నా, నా చుట్టూ ఉన్నవారు సిద్ధంగా ఉండాలి’ అని అన్నారు.
అయితే, ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ దాడి వెనుక బీజేపీకి ఎలాంటి రాజకీయ సంబంధం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే సర్బోరి ముఖర్జీ తెలిపారు. ‘వీరంతా దుండగులు. ప్రభుత్వం మారినప్పటి నుంచి, తృణమూల్‌కు చెందిన చాలా మంది దుండగులు కాషాయ రంగు కండువాలు కప్పుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు నేను గమనిస్తున్నా. మేము దీనిని ఖండిస్తున్నాం’ అని ఆయన అన్నారు.