బెంగళూరు: కర్ణాటక మంత్రి బీ నాగేంద్ర రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణల కారణంగా రెండోసారి మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు. శుక్రవారం తన రాజీనామాను ప్రకటించేటప్పుడు భావోద్వేగానికి లోనైన ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. (B Nagendra Quits) బీజేపీ తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నదని బీ నాగేంద్ర ఆరోపించారు. ‘నాకు రాజ్యాంగంపై నమ్మకం ఉంది. నాపై వచ్చిన ఆరోపణలపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీని అనేకసార్లు మేం కోరాము. కానీ వారు అందుకు ముందుకు రాలేదు. ‘మనుస్మృతిని రుద్దాలని’ బీజేపీ కోరుకుంటోంది. ఆ పార్టీకి ‘గిరిజన వ్యతిరేక వైఖరి’ ఉన్నది’ అని మీడియాతో ఆయన అన్నారు.
కాగా, ఎస్టీ వర్గానికి చెందిన కాంగ్రెస్ నేత బీ నాగేంద్ర తొలుత సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థలో రూ.89 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 2024 మే నెలలో ఆ సంస్థ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రశేఖరన్ ఆత్మహత్య చేసుకున్నారు. అనధికార నిధుల బదిలీ గురించి సూసైడ్ నోట్లో ఆయన పేర్కొనడంతో ఈ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఆ తర్వాత జరిగిన విచారణలో వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థ బ్యాంక్ ఖాతాల నుంచి భారీ మొత్తంలో నిధులు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు తేలింది. దీంతో ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ ఈ అంశాన్ని టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన బీ నాగేంద్ర, 2024 జూన్లో తొలిసారి మంత్రి పదవికి రాజీనామా చేశారు.
మరోవైపు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆగస్ట్ 3న జరిగిన మంత్రివర్గ విస్తరణలో బీ నాగేంద్రను తిరిగి కేబినెట్లోకి తీసుకున్నారు. ప్రణాళికా, గణాంక శాఖల బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అయితే వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థలో జరిగిన స్కామ్ గురించి బీజేపీ మళ్లీ పోరుబాట పట్టింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను బయటపెట్టేందుకు సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు రాయచూర్ నుంచి బళ్లారి వరకు 10 రోజుల పాదయాత్రను ఆ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రి బీ నాగేంద్ర అనూహ్యంగా శుక్రవారం రెండోసారి మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు. కన్నీళ్లతో తన రాజీనామాను ఆయన ప్రకటించారు.
“I am submitting my resignation to CM today to ensure party does not face any embarrassment.”
– Karnataka Minister Nagendra pic.twitter.com/ASBE2R5F9S
— News Arena India (@NewsArenaIndia) August 28, 2026