న్యూఢిల్లీ: ఒక మోడల్‌పై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేసిన జిమ్ ట్రైనర్‌ను ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలైన అతడ్ని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. (Gym Trainer Arrested) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల ముస్కాన్ చదువుకుంటూ మోడలింగ్ చేస్తున్నది. తిలక్ నగర్ ప్రాంతంలోని ఇంట్లో నివసిస్తున్న ఆమె బుధవారం సాయంత్రం కత్తిపోట్లకు గురై మరణించింది. గమనించిన పనిమనిషి పొరుగువారిని అలెర్ట్ చేయడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముస్కాన్‌ను ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, ముస్కాన్‌కు పరిచయమున్న జిమ్ ట్రైనర్ ఇమ్రాన్ బుధవారం సాయంత్రం 5.40 గంటల సమయంలో ఆమె ఇంటికి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. కత్తితో ఆమెపై దాడి చేసి పారిపోయిన అతడ్ని రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇమ్రాన్ కాల్పులు జరుపడంతో పోలీసుల ఎన్కౌంటర్లో గాయపడిన అతడ్ని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ముస్కాన్, ఇమ్రాన్ మధ్య ఏడాదిన్నర కాలంగా పరిచయం ఉన్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఆగస్ట్ 20న వీరిద్దరూ ఒక హోటల్లో కూడా కలుసుకున్నట్లు చెప్పారు. అయితే ముస్కాన్ మరొకరితో మాట్లాడటంతో ఇమ్రాన్ గత రెండు నెలలుగా ఆమెపై ఆగ్రహంతో ఉన్నాడని పోలీస్ అధికారి తెలిపారు. బుధవారం సాయంత్రం ముస్కాన్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు అక్కడికి వెళ్లినట్లు చెప్పారు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగడంతో ఆమెపై కత్తితో పలుమార్లు దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడని పోలీస్ అధికారి వివరించారు. నిందితుడు ఇమ్రాన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.