ఎల్ నినో గండం.. మరో 7-8 నెలలు!
అంతకంతకూ విపత్తు తీవ్రం.. వచ్చే ఏడాది మే-జూన్ వరకూ ప్రభావం కొనసాగే అవకాశం
- తొలుత ఫిబ్రవరిలో తగ్గొచ్చని వాతావరణ నిపుణుల అంచనా
- తాజాగా పసిఫిక్ జలాలు వేడెక్కడంతో మారుతున్న పరిస్థితి
- 2027 అత్యంత వేడి సంవత్సరంగా మారే ప్రమాదం
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): శీతాకాలంలోనూ ప్రపంచ దేశాలు భగ్గుమంటున్నాయి. ఐరోపాలోనైతే వేలాది మంది వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. దుర్భరమైన కరువుతో భారత్ కల్లోలితంగా మారింది. పగలు ఎండ వేడిమి కొత్త రికార్డులు నమోదు చేస్తున్నది. మొన్నటికి మొన్న ఎల్నినోగా మొదలైన ఈ విపత్తు.. సూపర్ ఎల్నినోగా మారి, ఆ తర్వాత గాడ్జిల్లా ఎల్ నినోగా పరిణామం చెంది ఇప్పుడు మరింతగా తీవ్రమయ్యింది. ఎంతగా అంటే, 150 ఏండ్ల కిందట ప్రపంచంపై విరుచుకుపడిన ఎల్‌నినో విపత్తును దాటేసి ఇప్పుడు ‘సూపర్ డూపర్ ఎల్‌నినో’గా రూపాంతరం చెందింది.
మారిన అంచనాలు
వచ్చే ఫిబ్రవరినాటికి ఎల్ నినో తీవ్రస్థాయికి చేరి అనంతరం తగ్గుముఖం పట్టొచ్చని గత నెలలో పలు వాతావరణ సంస్థలు అంచనాలు వేశాయి. అయితే, పసిఫిక్ మహా సముద్ర జలాల ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతుండటం, వాతావరణ మార్పులతో ఎల్‌నినో తన ప్రభావాన్ని మరింతగా పొడిగించుకొనే అవకాశమున్నట్టు నిపుణులు చెప్తున్నారు.
ఎల్ నినోతో పసిఫిక్ సలసలా!
ప్రపంచంపై పంజా విసురుతున్న ఎల్‌నినో అసాధారణ తీవ్రతతో కొనసాగుతున్నది. దీని కారణంగా పసిఫిక్ మహాసముద్రం ఒక ప్రధాన ఉష్ణోగ్రత పరిమితిని దాటింది. ఇప్పటికే ఎల్‌నినో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై చూపే ప్రభావం గురించి ఆందోళన పెంచుతున్నది. అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన నుంచి వచ్చిన డాటా ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 22న భూమధ్యరేఖ పసిఫిక్‌లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి.
ఇంతకుముందెన్నడూ ఉష్ణోగ్రత ఈ స్థాయికి చేరుకోలేదు. ఈ వాతావరణ తీవ్రత మరింత బలపడుతూ, వచ్చే ఏడాది వరకు కూడా దీని ప్రభావం కొనసాగే అవకాశం ఉండటంతో దీనిని కీలకఘట్టంగా భావిస్తున్నారు. మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్లలో అక్టోబర్-డిసెంబర్లలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులు వచ్చే మే-జూన్ వరకూ కొనసాగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. అనంతరం బలహీనపడిన తర్వాత ఎల్‌నినో పరిస్థితి ఏ దిశగా మారుతుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని అభిప్రాయపడుతున్నారు. ఎల్‌నినో కారణంగా 2027 చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా నిలిచే అవకాశమున్నట్టు చెప్తున్నారు.
ఆర్థిక వ్యవస్థలకూ కష్టమే
ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్‌నినో పరిస్థితులు వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ వరకూ కొనసాగే అవకాశం ఉన్నదని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ) హెడ్ డాక్టర్ జే రాజేశ్వర్ తెలిపారు. ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే ఎల్‌నినో వచ్చే జూన్ వరకు కూడా ఉండొచ్చని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు నమోదు చేసే అవకాశమున్నట్టు పేర్కొన్నారు.
మధ్య పసిఫిక్ జలాల ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతుండటంతో వచ్చే ఏడాది మే-జూన్ వరకూ ఎల్‌నినో నిలకడగా ఉండే పరిస్థితులు బలపడుతున్నాయని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అధికారులు పేర్కొన్నారు. కాగా, శక్తిమంతమైన ఎల్‌నినో కారణంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికాతో పాటు భారత్ సహా ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదుపులకు లోనయ్యే ప్రమాదం ఉన్నదని, దీనికి అందరూ సిద్ధంగా ఉండాలని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
ఉసూరుమనిపించిన నైరుతి
గడిచిన దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఈసారి నైరుతి రుతు పవనాలు ముఖం చాటేశాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా 13 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. దేశంలోని 44 శాతం జిల్లాల్లో వర్షపాతం లోటు మరింత తీవ్రంగా నమోదయ్యింది. ఎల్‌నినో వల్లే ఈ పరిస్థితులు తలెత్తినట్టు నిపుణులు చెప్తున్నారు. ఎల్‌నినోతో ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, ఏపీ, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ర్టాల్లో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. రానున్న రోజులు పరిస్థితులు మరింతగా దిగజారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

