ముంబై, అక్టోబర్ 6 : ఓటర్ల జాబితా నుంచి అర్హులైన పౌరుల పేర్లు ఎందుకు తొలగిస్తున్నారంటూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ను బాంబే హైకోర్టు నిలదీసింది. తమ ఓట్లను జాబితా నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ గోవాకు చెందిన పరేశ్ సల్గాంకర్, కుటుంబ సభ్యులు దాఖలు చేసిన కేసును న్యాయస్థానం విచారించింది. ‘ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ద్వారా పౌరుల ఓటర్లను తొలగిస్తున్నట్టయితే ఈ చర్య ఉద్దేశం ఏమిటి?’ అని జస్టిస్‌లు వాల్మీకి మెంజెస్, అమిత్ జమసందేకర్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. ఓటర్లు కేవలం ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉన్నారా లేదా అని మాత్రమే కాకుండా వారు భారతీయ పౌరులా కాదా అన్న విషయాన్ని సర్ ప్రక్రియ ధ్రువీకరించాలని న్యాయస్థానం నొక్కి చెప్పింది.
ఈసీఐ తరపు న్యాయవాది అగ్ని మాట్లాడుతూ గణన పత్రాలు నింపకుండా ముసాయిదా జాబితాల నుంచి పేర్లు తొలగించిన వారికి ఫామ్ 8ను ప్రాసెస్ చేయడం సాధ్యం కాదని తెలిపారు. దానికి కోర్టు స్పందిస్తూ ఫామ్ 8 అనేది ముసాయిదా జాబితాలను సరిచేసి ఓటర్ల పేర్లను చేర్చడానికి ఉద్దేశించినదని పేర్కొంది. ఒకచోట నుంచి మరో ప్రదేశాలకు మారే వ్యక్తులు కొత్త ప్రదేశాలలో తమ పేర్లను నమోదు చేయడానికి ఫామ్ 6ను ఎందుకు నింపాలని ధర్మాసనం ప్రశ్నించింది. అటువంటి ప్రకటనలనపై ఓటర్లు సంతకం చేయరని పేర్కొన్న న్యాయమూర్తులు తదుపరి సమీక్ష కోసం గణన పత్రాలు, అనుబంధాలు సమర్పించాలని ఈసీఐని ఆదేశించింది.