Bengal Govt : పశ్చిమబెంగాల్ (West Bengal) లోని బీజేపీ ప్రభుత్వం (BJP Govt) అధికారిక వేదికల నుంచి ‘బిశ్వ బంగ్లా (Biswa Bangla)’ లోగోను తొలగించడం ప్రారంభించింది. మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) హయాంలో ప్రవేశపెట్టిన ఈ లోగో స్థానంలో భారత జాతీయ చిహ్నమైన అశోక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తోంది. కోల్‌కతా (Kolkata) లోని ప్రముఖ సాల్ట్ లేక్ స్టేడియం (Salt Lake Stadium) వద్ద బిశ్వ బంగ్లా బోర్డును తొలగించి అశోక చిహ్నాన్ని పెట్టారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ విభాగాలు, సేవలను అనుసంధానించే ‘ఎగియే బంగ్లా’ పోర్టల్‌లో కూడా అశోక చిహ్నాన్ని ఉంచారు. గతంలో ఉన్న తెలుపు, నీలం రంగుల థీమ్‌ను మార్చి కాషాయ రంగును చేర్చారు. బెంగాలీ అక్షరం ‘బ’ ఆధారంగా రూపొందించిన ఈ బ్రాండ్ 2013 సెప్టెంబర్ 16న ప్రారంభమైంది. బెంగాల్ సంస్కృతి, పర్యాటకం, హస్తకళలకు ప్రతీకగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని విస్తృతంగా వాడింది. ప్రస్తుతం అప్డేట్ చేసిన పోర్టల్‌లో అశోక చిహ్నంతోపాటు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫొటోను పెట్టారు.
పర్యాటకం, పరిశ్రమలు, వ్యవసాయ శాఖల ఐకాన్లను కాషాయ రంగు గ్రాఫిక్స్‌తో రీడిజైన్ చేశారు. ఒక వ్యక్తి రూపొందించిన లోగో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ముద్రగా ఉండకూడదంటూ బీజేపీ నేతలు ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు.