న్యూఢిల్లీ, అక్టోబర్ 8: దేశ రాజధానిలో బుధవారం జరిగిన నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక మహిళా కానిస్టేబుల్‌ను అసభ్యకరంగా తాకారని, ప్రియాంక గాంధీ వాద్రా ఒక మహిళా పోలీసును కడుపులో కొట్టారని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ నాయకుల ఈ చర్యలు వారి పితృస్వామ్య వ్యవస్థను అంతం చేయాలి అనే నినాదానికి విరుద్ధంగా ఉన్నాయని ఆ పార్టీ పేర్కొంది.
అధికారాన్ని చేజిక్కించుకోవాలని తీవ్ర ఆత్రుతతో ఉన్న రాహుల్ గాంధీ, వీధి పోరాటాల ద్వారా దేశంలో నేపాల్, బంగ్లాదేశ్ తరహా అరాచక పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు. రాజధానిలో అరాచకాన్ని సృష్టిస్తున్నారని, నిరసనల సమయంలో పోలీసులపై దాడి చేశారని రాహుల్, ప్రియాంకలపై మరో బీజేపీ అధికార ప్రతినిధి సిద్ధార్థ యాదవ్ ఆరోపించారు. ఈ నిరసనలో సాధారణ పౌరులెవరూ పాల్గొనడం లేదని ఆయన అన్నారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మహిళా పోలీసు కానిస్టేబుల్‌తో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సెంట్రల్ ఢిల్లీలోని డీడీయూ మార్గ్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద గురువారం బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు.