బెంగళూరు: అతను ఓ సినీ నిర్మాత. కొన్ని సినిమాల్లో నటించాడు కూడా. రెండేళ్ల క్రితం (2021లో) ఆయన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేస్తూ తన మొబైల్ ఫోన్లో వీడియోలు కూడా తీసుకున్నాడు. తర్వాత ఆ వీడియోలను లీక్ చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఒకసారి డబ్బులు తీసుకుని కూడా ఇప్పుడు మరోసారి బెదిరింపులకు దిగుతున్నాడు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వీరేంద్ర బాబు కన్నడ సినీ నిర్మాత. సినిమాలకు పెట్టుబడి పెడుతూనే కొన్ని సినిమాల్లో నటించాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఆయనకు ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరా చేసుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు.
తనకు రూ.15 లక్షలు ఇవ్వాలని, లేదంటే వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరించాడు. దాంతో భయపడిన బాధితురాలు తన ఒంటి మీది నగలు అమ్మి రూ.15 లక్షలు చెల్లించింది. ఆ తర్వాత రెండేళ్ల నుంచి మౌనంగా ఉన్న వీరేంద్ర బాబు తాజాగా మరోసారి బెదిరింపులు మొదలుపెట్టాడు. మహిళకు ఫోన్ చేసి పిలిచి కారులో ఎక్కించుకున్నాడు.
తాను అడిగిన డబ్బులు చెల్లించకపోతే చంపేస్తానంటూ తుపాకీ గురిపెట్టి బెదిరించాడు. దాంతో సరేనని ఒప్పుకున్న మహిళ బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.