డ్యాన్స్ అంటే ఆ యువకుడికి ప్రాణం.. వెరైటీ స్టెప్పులు అతని స్పెషాలిటీ. నిత్యం కొత్త స్టెప్పులు,
విభిన్న వేషాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కళాకారుడైన తన తండ్రి నాటకాలు చూసి
డ్యాన్సర్ కావాలనుకున్నాడు. అదే లక్ష్యంతో సినిమాలు, టీవీ ప్రోగ్రామ్‌లు చూస్తూ గురువు
లేకుండానే స్వతహాగా ప్రాక్టీస్ చేసి డ్యాన్స్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. టీవీ షోలు, సినీ ఆడియో లాంచ్ ప్రోగ్రామ్‌లలో సైతం రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు దామరచర్ల మండలం వాడపల్లి గ్రామానికి చెందిన సమీర్.
వాడపల్లి గ్రామానికి చెందిన ఎండీ ఇనాయతుల్లా, వహీదున్సీసాబేగం దంపతుల కుమారుడు సమీర్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌పై మక్కువ ఉండేది. డ్యాన్స్‌లో రాణించడానికి అతని తండ్రి ఇనాయతుల్లా ఆదర్శం. మంచి కళాకారుడు అయిన ఇనాయతుల్లా ప్రదర్శించే నాటకాలను చూసి వెరైటీగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు. సినిమాలు, టీవీ ప్రోగ్రామ్‌లు తిలకించి గురువు లేకుండా స్వతహాగా డ్యాన్స్ నేర్చుకున్నాడు.
సమీర్ అందరిలా కాకుండా నిత్యం డ్యాన్స్‌లో కొత్తదనం, వెరైటీ స్టెప్పులను వెతుకుతాడు. దీంతోపాటు హాలో మ్యాన్, డెవిల్, డబుల్ హెడ్, ప్రేమ పిచ్చోడు వంటి వేషాలతో డ్యాన్స్‌లు వేసి అందరినీ మెప్పించి శభాష్ అనిపించుకున్నాడు. అతని డ్యాన్స్ చూసిన అనేక మంది సినీ కళాకారులు అభినందించారు. డ్యాన్స్ పోటీలతోపాటు పలు గ్రామాల్లో డేర్ టూ డ్యాన్స్ పేరుతో నృత్య పాఠశాలను ఏర్పాటు చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు డ్యాన్స్ నేర్పుతున్నాడు. పిల్లల్లో నైపుణ్యతను పెంచుతూ పోటీలకు పంపుతున్నాడు.
మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతుండగా నిర్వహించిన ఫంక్షన్లో సమీర్ డ్యాన్స్ వేసి అందరినీ మెప్పించాడు. అప్పటి నుంచి అతనిలో మరింత పట్టుదల పెరిగింది. డ్యాన్స్‌లో రాణిస్తూ ఎక్కడ పోటీలు నిర్వహించినా పాల్గొనే సమీర్ ప్రేక్షకుల మన్ననలు పొందడంతోపాటు ఏదో ఒక బహుమతి సాధించేవాడు. నల్లగొండలో నిర్వహించిన పోప్ పాల్ 6వ జూనియర్ డ్యాన్స్ పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకున్నాడు. పాఠశాల స్థాయిలో 20 అవార్డులను దక్కించుకున్నాడు. కాలేజీ స్థాయిలో హైదరాబాద్, గుంటూరు జిల్లాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అనేక అవార్డులు పొందాడు. 2004లో వినుకొండలో నిర్వహించిన నా ఆట – నా పాట కార్యక్రమంలో, 2011లో కారంపూడిలో, 2014లో కోదాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి డ్యాన్స్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచాడు.
కొత్త సినిమాల ఆడియో లాంచ్ ప్రోగ్రామ్‌ల్లో సమీర్ డ్యాన్స్ ప్రదర్శించేవాడు. పాండవులు సినిమా ఆడియో లాంచ్‌లో సమీర్ చేసిన డ్యాన్స్ అందరినీ అలరించింది. వీటితోపాటు డ్యాన్స్ బేబీ డ్యాన్స్, ఆట వంటి టీవీ కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభ చాటాడు. గ్రామాల్లో నిర్వహించే మ్యారేజ్ ఈవెంట్స్, వినాయక చవితి, జాతర్లలో డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తూ అందరితో మెప్పు పొందుతున్నాడు. రవీంద్ర భారతీలో గత ఏడాది ప్రదర్శించిన నృత్య రూపకానికి మొదటి బహుమతి లభించింది.
ఒక టీవీ చానల్లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలోని కళాకారులతో కలిసి తమిళనాడు, ఆంధ్రా రాష్ర్టాల్లో పలు ఈవెంట్లలో సమీర్ పాల్గొన్నాడు. వారి ప్రోత్సాహం, సహకారంతో ఏడాదికి సుమారు 40 నుంచి 50 ఈవెంట్లల్లో పాల్గొంటున్నాడు. ఒక్కో ఈవెంట్‌కు రూ.40వేల వరకు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం సమీర్ మండలంలోని ఒక సిమెంటు కర్మాగారంలో పనిచేస్తూనే మరోపక్క డ్యాన్స్ ప్రదర్శనలు ఇస్తున్నాడు. సమీర్‌కు ప్రత్యేకంగా ఆర్కెస్ట్రా ఉన్నది. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా మరో 10 మంది కళాకారులకు ఉపాధి చూపిస్తున్నాడు.
గురువు లేకుండా సొంతంగా డ్యాన్స్ నేర్చుకున్నా. ఇప్పటిదాకా అనేక పోటీల్లో పాల్గొని అందరి మన్ననలు పొందాను. సాంప్రదాయ నృత్యం కాకుండా ప్రస్తుతం ఉన్న జనరేషన్, టెక్నాలజీ, ఫ్యాషన్ మేరకు వెరైటీ డ్యాన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాను. నాకు నా తండ్రి ఇనాయతుల్లా ఆదర్శం అయ్యాడు. మా నాన్న మంచి కళాకారుడు. అతని నుంచి వేష భాషలను నేర్చుకున్నా. అవి డ్యాన్స్‌లో మంచిగా ఉపయోగపడుతున్నాయి. నాకు గొప్ప సినీ కొరియోగ్రాఫర్ కావాలని ఉంది. తప్పకుండా అవుతాననే నమ్మకం ఉన్నది. మా లాంటి డ్యాన్సర్లకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి.
– ఎండీ సమీర్, డ్యాన్సర్