ఇప్పుడు ఎవరి నోటా విన్నా ఒక్కటే మాట! డిసెంబర్ 31 నైట్ సెలబ్రేషన్స్ ఎక్కడ? 2022కి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చిన్నాపెద్ద సిద్ధమయ్యారు. ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా యువత పార్టీలు, దావత్‌లు అంటూ ఫుల్ జోష్ మీద కనిపిస్తున్నది. కొద్దిమంది ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టు హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్‌హౌస్‌లు న్యూ ఇయర్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుతునారు. డ్రంకెన్ డ్రైవ్ వంటివి చేయొద్దని, హద్దు మీరితే అవస్థలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరోవైపు జనవరి ఒకటిన నూతన సంవత్సరం, రెండున ముక్కోటి ఏకాదశి ఉండడంతో ఆలయాలు ముస్తాబవుతున్నాయి.
రామగిరి, డిసెంబర్ 30 : కాలగర్భంలో మరో ఏడాది నేటితో గడిచిపోనుండగా కొంగొత్త ఆశలతో నూతన ఆంగ్ల సంవత్సరాదికి స్వాగతం పలికేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు వేడుకలకు సిద్ధమవుతున్నారు. శనివారం సాయంత్రం నుంచే ఆటపాటలతో ఉత్సాహంగా గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. న్యూఇయర్‌కు కావాల్సిన కేకులు, స్వీట్లు, బిర్యానీలకు గిరాకీ ఉండడంతో మార్కెట్లో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా న్యూఇయర్ సందడి షురూ అయ్యింది. మార్కెట్లు కొనుగోళ్లతో కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలపై జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పోలీసుశాఖ పలు సూచనలు చేయడంతో అందుకనుగుణంగా వేడుకలు జరుపుకొనేలా సిద్ధం చేసుకుంటున్నారు.
రంగవల్లులు.. సంబురాలు
కాలనీలు, అపార్టుమెంట్లతోపాటు ఇండ్ల ముంగిళ్లలో వేసే రంగవల్లులు అబ్బుర పర్చనున్నాయి. శుక్రవారమే కొంతమంది వీటికి కావాల్సిన రంగులను కొనుగోలు చేశారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువర్గంతో సంబురాలు జరుపుకొనేలా ప్లాన్ చేసుకుంటున్నారు. న్యూఇయర్ ఈవెంట్ వేడుకలను అంతా ఆనందంగా జరుపుకోనున్నారు. దాంతో ఆ ప్రాంతాల్లో ముందస్తు న్యూ ఇయర్ సందడి కనిపిస్తున్నది.
భలే ఆఫర్లు
న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని ముందస్తుగానే ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేశారు. చికెన్, మటన్, ఫిష్ బిర్యానీలతోపాటు జంబో, ఫ్యామిలీ ప్యాక్‌లతో ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బుకింగ్ నడుస్తున్నాయి. కేక్‌లు, స్వీట్ల కొనుగోలుకు గిరాకీ పెరిగింది. మద్యం దుకాణాలు సైతం అదే స్థాయిలో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా యువత సంబురాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉండటం విశేషం.
నూతన వేడుకకు ముస్తాబైన దేవాలయాలు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలు దేవాలయాలను ముస్తాబు చేశారు. విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలను భక్తులు సందర్శించే అవకాశం ఉండడంతో అందుకనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. నల్లగొండ రామగిరిలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు జరుగుతుండగా నూతన వేడుకలకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 2న ముక్కోటి ఏకాదశి ఉండగా ఉత్తర ద్వార దర్శనాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా చర్చిలను సైతం విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. నల్లగొండ గడియారం సెంటర్లోని సెంటినరీ తెలుగు బాప్టిస్టు చర్చితోపాటు దేవరకొండ రోడ్డులోని మరియగుట్ట, మరియమాత తదితర చర్చిలో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేయించనున్నారు.
పోలీసు ఆంక్షలతో..
కొత్త ఏడాది సందర్భంగా పోలీసుల ఆంక్షలు విధించడంతో పలు కాలనీలు, అపార్టుమెంట్లలోనే సంబురాలు జరుపుకొనేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. ఎక్కువ శాతం కుటుంబాలు, కాలనీవాసుల సమక్షంలోనే వేడుక చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. న్యూఇయర్ ఏర్పాట్లకు యువత ముందస్తు ఆలోచనలతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పండుగ వాతావరణం కనిపిస్తున్నది.