పెంపుడు కుక్క తెలుసుకానీ, పెంపుడు మొక్క ఏంటి అనుకుంటున్నారా?! అవునండీ ఇప్పుడు మొక్కల్నీ పెట్లుగా చేసుకోవచ్చు. ‘ప్లాంట్సియో ఇవీ జెన్ 2’ అనే పూలకుండీ మనకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ చిన్ని రోబోట్‌లో అత్యంత సునిశితమైన 9 సెన్సర్లు ఉంటాయి. కుండీ ముందు భాగంలో డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో మొక్క హావభావాలు ఎమోజీ రూపంలో కనిపిస్తుంటాయి. కళ్లు, ముక్కు ఉండి 100 రకాల భావాలను వ్యక్తపరిచేలా కుండీ మీద మనకి ముఖం కనిపిస్తుంది. మనం ముట్టుకున్నప్పుడు కూడా ఇది స్పందిస్తుంది. అలాగే మొక్కకు నీరు, ఎండ, మట్టిలో తేమ ఎంతెంత శాతంలో అందుతున్నాయి, అది మంచిగా ఎదగడానికి ఇంకా ఎరువుల్లాంటివి ఏమైనా కావాలా? అనేవి కూడా చక్కగా తెలుసుకోవచ్చు.
ఉదాహరణకు, నీళ్లు పోయడం మర్చిపోయామనుకోండి… ఇది బుంగమూతి పెడుతుంది. అదే పోయగానే గబగబా తాగినట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి చక్కగా నవ్వుతుంది. ఇక, యాప్ ద్వారా ఫోన్‌కి కనెక్ట్ అయ్యే ఈ కుండీలో దాదాపు అరవై రకాల మొక్కల దాకా సమాచారం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆరోగ్యంగా పెంచడం సులభం. డెస్క్‌టాప్ మీద పెట్టుకోగలిగే ఈ చిన్ని కుండీ ద్వారా పిల్లినో, కుక్కపిల్లనో సాకిన అనుభూతి పొందుతూ మొక్కను పెంచుకోవచ్చు. ఐడియా అదిరింది కదూ!