చదివింది ఏడో తరగతి. వారసత్వం లేదు. అనుభవం లేదు. మనుగడ కోసం పోరాటమే ఆ గృహిణిని ఆంత్రప్రెన్యూర్‌గా మార్చింది. టైలరింగ్‌తో మొదలై రెడీమేడ్ గార్మెంట్స్ తయారీ వరకూ ఆమె ప్రయాణం ఓ స్ఫూర్తిపాఠం. నిజామాబాద్ జిల్లాకు చెందిన లత.. లక్షలకొద్దీ ఆర్డర్లను స్వీకరిస్తూ వేలకొద్దీ యూనిఫామ్‌లు తయారు చేస్తున్నారు. వ్యాపారాన్ని ఎలా విస్తరించాలో తెలియని పరిస్థితుల్లో వీహబ్ నేర్పిన బిజినెస్ పాఠాలు ముందుకు నడిపించాయని చెబుతారు లత.
నిజామాబాద్ జిల్లా కోరుట్ల మండలంయూసఫ్ నగర్ మా సొంతూరు. ఊళ్లోనే ఏడో తరగతి వరకూ చదువుకున్నా. ఎనిమిదో క్లాసుకు పట్టణానికి వెళ్లాలి. చాలా దూరం. బస్సులో ప్రయాణించాలి. మాది నిరుపేద కుటుంబం. అంత స్తోమత లేదు. దీంతో చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఖాళీగా ఉండటం ఎందుకని టైలరింగ్ నేర్చుకున్నా. ఆ ఫీజు కట్టడానికి కూడా చెవి కమ్మలను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆతర్వాత క్రమక్రమంగా బ్లౌజులు, చిన్న పిల్లల డ్రెస్సులు కుట్టడం నేర్చుకున్నా. టైలరింగ్‌లో పట్టు సాధించాక మరికొందరికి నేర్పించడం మొదలుపెట్టాను. అంతలోనే నా పెండ్లి జరిగిపోయింది. నా భర్త దేవేందర్ ఉద్యోగం కారణంగా నిజామాబాద్‌కు వచ్చేశాం. రెండేండ్లపాటు ఇంట్లో ఖాళీగా ఉన్నా. కొన్ని కారణాల వల్ల నా భర్త ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఇల్లు గడవడం కష్టమైన పరిస్థితుల్లో నేను నేర్చుకున్న టైలరింగే నాకు ఉపాధి మార్గం చూపింది.
ఓ బట్టల దుకాణంలో చిన్నపాటి ఉద్యోగం దొరికింది. దుస్తులు కుట్టి షాప్‌కు పంపడం నా బాధ్యత. కానీ, దానికి ఓ కుట్టు మెషీన్ అవసరమైంది. అప్పు చేసి కొన్నాం. నెలనెలా ఏడువేల రూపాయల వరకూ వచ్చేది. పాప పుట్టాక ఖర్చులతోపాటు అవసరాలు పెరిగాయి. నా భర్త స్కూళ్లకు వెళ్లి బెల్టులు, టైలు, ఐడీ కార్డుల తయారీ కోసం ఆర్డర్స్ తెచ్చేవారు. క్రమంగా స్కూల్ యూనిఫామ్ ఆర్డర్స్ రావడం మొదలైంది. ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. మా వ్యాపారం రెండువేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది.
అనేక ప్రాణాలను బలితీసుకున్న కరోనా.. నా జీవితాన్ని మాత్రం మార్చేసింది. అమాంతంగా మాస్క్‌లకు గిరాకీ పెరగడంతో.. పెద్ద ఆర్డర్ వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు.. పదిహేను రోజుల్లో లక్ష మాస్క్‌లు కుట్టాలని అధికారులు చెప్పారు. ఆర్డర్ అయితే వచ్చింది కానీ, అంత పెట్టుబడి డబ్బు మా దగ్గర లేదు. ఏం చేయాలో పాలుపోలేదు. బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాం. మెషినరీ సమకూర్చుకుని సకాలంలో సరుకు అందించాం. మొత్తంగా మూడు లక్షల రూపాయల లాభం. పెద్ద మొత్తమే! ఆ తర్వాత 20వేల మంది ఆశా వర్కర్స్కు బ్లౌజ్‌లు కుట్టే ఆర్డర్ వెతుక్కుంటూ వచ్చింది. నా శ్రమను గుర్తించి కేఎంసీ అనే సంస్థ రూ.10 లక్షల విలువైన మెటీరియల్ క్రెడిట్‌గా ఇచ్చి ప్రోత్సహించింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు మూడు లక్షల యూనిఫామ్స్ కుట్టే అవకాశమూ దక్కింది. అప్పుడే లతా గార్మెంట్స్ పేరుతో నాలుగు శాఖలు ప్రారంభించాను. తక్కువ ధరలోనే నాణ్యమైన ఫ్యాషన్ వస్ర్తాలు అందించాలన్నది నా ఆశయం. కస్టమర్ సంతోషమే నా విజయ రహస్యం. కుటుంబ బాధ్యతలు, పేదరికం.. ఎదుగుదలకు అవరోధాలు కానేకావు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ.
వ్యాపార వృద్ధిలో నా భర్త వెన్నంటి నిలిచారు. ‘వీ హబ్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యాను. వివిధ రంగాల నిపుణులు అకౌంటింగ్, మార్కెటింగ్, ట్యాక్సేషన్‌కు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. కరోనా సమయంలో నా దగ్గర పనిచేసిన వారికి వంట సామగ్రి అందించి ఆదుకున్నా. ఏదైనా ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని పేద విద్యార్థుల చదువుకు సహకారం అందించాలన్నది నా ఆశయం. ఈ సత్కార్యానికి త్వరలోనే కార్యరూపం తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. సృజన మహిళ సొంతం. పట్టుదల ఆమె ఆభరణం. నాయకత్వ లక్షణాలు జన్మతః అబ్బుతాయి. కావాల్సిందల్లా ప్రోత్సాహం. వీహబ్ లాంటి వేదికలు మహిళా ఆంత్రప్రెన్యూర్స్‌ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి.
-గంజి ప్రదీప్‌కుమార్