Korean | కవిత్వం చదివితే భావుకత పెరుగుతుంది. కథలు చదివితే సమాజం అర్థం అవుతుంది. కావ్యాలు చదివితే పదకోశం సొంతం అవుతుంది. అదే, మనుషుల్ని చదివితే.. జీవితం మీదే అవుతుంది. బంధాలు బలపడతాయి. అపోహలు తొలగిపోతాయి. ఆత్మీయతలు పరిఢవిల్లుతాయి. కొరియన్ల ఆనంద రహస్యం, విజయ సూత్రం కూడా ఆ మనసు ఫార్ములా మీదే ఆధారపడి ఉంటుంది. ‘నూన్-చీ’ ప్రసాదించిన మనోబలంతోనే దక్షిణ కొరియా అతి తక్కువ కాలంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదిగింది. ఆ విజయం వెనుక పెద్దపెద్ద నేతల్లేరు. ‘నూన్-చీ’ తెలిసిన సామాన్య ప్రజలే ఉన్నారు. ఆ మంచిని మనతో పంచుకోడానికి సిద్ధంగా ఉన్నారు వారు.
ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. కానీ, పొరపాటున కూడా ఎవరూ వాటిని పట్టించుకోరు.
-ఆర్థర్ కానన్ డోయెల్
.. అలాంటి అనేకానేక అత్యద్భుత విషయాల్లో ‘నూన్-చీ’ ఒకటి. ఎదుటి మనిషిని అంచనా వేయడానికైనా, ప్రస్తుత పరిస్థితిని బేరీజు వేయడానికైనా కళ్లను మించిన కొలమానం లేదనేది ‘నూన్-చీ’ సిద్ధాంత మూలసారం. ఉదాహరణకు ఓ పెద్ద కంపెనీలో కొత్తగా చేరారు మీరు. సరిగ్గా ఆ రోజే పార్టీ జరుగుతున్నది. మిమ్మల్ని కూడా పిలిచారు. నలుగుర్నీ ఇంప్రెస్ చేయడానికి అదో మంచి అవకాశం కూడా. సరిగ్గా మీరు కాలుపెట్టే సమయానికి ఓ పెద్దావిడ ఏదో జోక్ చెబుతున్నది. అందరూ పగలబడి నవ్వుతున్నారు. అప్పుడు మీరేం చేస్తారు?
ఒకటి.. అంతకంటే మంచి జోక్ చెప్పి నవ్విస్తారా?
రెండు.. ఆ జోక్ ఏమంత గొప్పగా లేకపోయినా పగలబడి నవ్వేస్తారా?
మూడు.. ఆ జోక్ చెప్పిన పెద్దావిడని మెచ్చుకుంటారా? మీ సమాధానం..
ఒకటి అయితే.. మీ ‘నూన్-చీ’ పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
రెండు అయితే.. మీరు బృంద మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నట్టే.
మూడు అయితే.. అభినందనలు. మీకు ‘నూన్-చీ’ సత్తా తెలిసినట్టే.
నూన్-చీ అనేది కొరియన్ సూపర్ పవర్. ఎదుటి మనిషి మనసును ఓ పుస్తకంలా చదివేయగల శక్తి
కొరియన్లకు ఉందనీ, అది ‘నూన్-చీ’ వల్లే వచ్చిందనీ ఓ ప్రచారం. ఆ మాట నిజమే కావచ్చు.
ఎదుటి మనిషి..
ఏం ఆలోచిస్తున్నారు?
ఎలా ఫీలవుతున్నారు?
అనేది ఆ క్షణానికే మనకు తెలిస్తే కనుక, సగం సమస్య పరిష్కారం అవుతుంది.
ఆ వ్యక్తి మాటలు, హావభావాలు, కదలికలు అందుకు తోడ్పడతాయి.
ఆ బేరీజు కచ్చితంగా జరగాలంటే.. మీరు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి అరుదైన సామర్థ్యం ఉన్నవారి ప్రస్తావన వచ్చినప్పుడు కొరియన్లు ‘ఆ వ్యక్తి నూన్-చీ బావుంది’ అనరు. ‘ఆ వ్యక్తి నూన్చీ వేగ వంతంగా ఉంది’ అని కితాబు ఇస్తారు. ఇక్కడ వేగం చాలా ముఖ్యం.
ఈ కళను కనుక ఒంటబట్టించుకుంటే.. బంధాలు బలపడతాయి. ఇదొక రహస్య ఆయుధం. కనిపించని క్షిపణి. నీ సగం జీవితం నూన్-చీ చుట్టే తిరుగుతుంది. మంచి స్నేహితుల్ని ఎంచుకోవచ్చు. మంచి జీవిత భాగస్వామిని మనువాడవచ్చు. మంచి కస్టమర్లకు డిస్కౌంట్లు ఇచ్చి వ్యాపారం పెంచుకోవచ్చు. ఉద్యోగంలో పేరు తెచ్చుకోవచ్చు. శత్రువుల నుంచి రక్షించుకోవచ్చు. ఈ సూత్రాన్ని దక్షిణ కొరియా వ్యక్తిగత జీవితాలకే కాదు, ప్రభుత్వ పాలనకూ అన్వయించుకుంటుంది.
సున్నా నుంచి..
ఐదు దశాబ్దాల్లో దక్షిణ కొరియా.. అనూహ్యమైన ప్రగతిని సాధించింది. కటిక పేదరికం నుంచి అపార సంపదల వైపు అడుగులు వేసింది. ఒకనాడు దక్షిణ కొరియా అత్యంత నిరుపేద దేశం. దానికితోడు సహజ
వనరులు లేవు. పాతాళానికి తవ్వినా చుక్క పెట్రోలు కూడా దొరికేది కాదు. ఇరవై ఒకటో శతాబ్దం నాటికి ముఖచిత్రమే మారిపోయింది. సంపదలకు నిలయమైంది. సాంకేతికతకు చిరునామాగా మారింది. ఇన్ని విజయాలకు కారణం ఒక్కటే.. ‘నూన్-చీ’. బాల్యం నుంచీ తల్లిదండ్రులు పిల్లలకు ఈ సూత్రాన్ని బోధిస్తారు. తెలుగు పేరెంట్స్ ‘నీకసలు బుద్ధి ఉందా?’
అన్నట్టుగానే.. ‘నీకసలు నూన్-చీ ఉందా?’ అని దక్షిణ కొరియా తల్లిదండ్రులు పిల్లల్ని కోప్పడతారు.
కొందరికి నూన్-చీ పుట్టుకతోనే వస్తుంది. కొందరికి పెంపకంతో సాధ్యపడుతుంది. మరికొందరు సాధనతో సొంతం చేసుకుంటారు. ఇంకొందరు అనుభవాలతో రాటుదేలతారు.
దక్షిణ కొరియన్ల జీవితాన్ని సంప్రదాయ సూత్రాలే నడిపిస్తాయి. తమకంటే ఒక్క రోజు పెద్ద అయినా సరే.. గౌరవ వాచకం జోడించకుండా పిలవరు. ఎదుటి మనిషికి విజిటింగ్ కార్డు ఇస్తున్నప్పుడు.. ప్రసాదం అందించినంత భక్తిగా రెండు చేతులతో ఇస్తారు.
ఎదుటి వ్యక్తి కూడా అంతే గౌరవంగా అందుకుంటారు. తీసేసుకోగానే పర్సులో తురిమేసుకోరు. ఓసారి ఆసాంతం చదివి, మల్లెపువ్వంత సుతారంగా కార్డుల డబ్బాలో జోడిస్తారు.
పాథమిక సూత్రాలు..
ఇదొక ఉద్వేగ ప్రజ్ఞ
అవును. నూన్-చీ ఓ ఉద్వేగ ప్రజ్ఞ. ఎదుటి వ్యక్తి ఎమోషన్స్‌ను అర్థం చేసుకోడానికి, మన ఎమోషన్స్‌ను నియంత్రించుకోడానికి బాగా పనికొస్తుంది. ‘నోరు మూయించగల శక్తి ఉన్నా, నేలమట్టం చేయగల భుజబలం సొంతమైనా, దెబ్బతీయడం అనివార్యమైనా… ఓరిమితో వ్యవహరించేవాడే విజ్ఞుడు’ అంటుంది నూన్-చీ. ఎమోషనల్ ఇంటెలిజన్స్ ఉన్నప్పుడే ఇదంతా సాధ్యం అవుతుంది. నూన్-చీలో ఓ క్విజ్ ఉంది. మీరూ ప్రయత్నించండి.
కింది స్టేట్మెంట్స్లో క్విక్ నూన్-చీకి ప్రాతినిధ్యం వహించే విషయం ఏది?
ఎ. మీకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి.. కాఫీ ఇచ్చిన కాసేపటి తర్వాత.. ‘కూరలు తక్కువగా ఉన్నాయి. మరి, మీరు రాత్రికి భోజనానికి ఉంటున్నారా?’ అని అడిగితే మీరేం చేస్తారు?
‘పర్వాలేదు. పచ్చళ్లతో సర్దుకుంటాను’ అని చెబుతారు.
బి. ఆఫీసు మీటింగ్‌లో మీ సహోద్యోగి తన ప్రజెంటేషన్ పూర్తి చేస్తారు. ‘మీ సందేహాలు తీరాయనుకుంటే.. సమావేశాన్ని ముగిద్దాం. భోజనానికి వెళ్దాం. ఇప్పటికే ఆలస్యమైంది?’ అని ప్రకటిస్తారు. అప్పుడు మీరు..
‘కానీ నేనో ప్రశ్న అడగాలని అనుకుంటున్నా?’ అంటూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు.
సి. ఒత్తిడికి గురైనప్పుడు మీ బాస్.. చాక్లెట్లు తింటాడని మీకు తెలుసు. మీ ప్రమోషన్ గురించి ఆయనతో ప్రస్తావించే ముందు బాస్ డస్ట్‌బిన్‌లో చాక్లెట్లు ఉన్నాయో లేదో గమనిస్తారు మీరు.
ఇక్కడ నూటికి నూరుపాళ్లు ‘నూన్-చీ’ పరిష్కారం.. సి. అవును. మీరు కళ్లతోనే పరిస్థితుల్ని బేరీజు వేశారు. అధికారి మూడ్‌ను అర్థం చేసుకున్నారు. తిరస్కారాన్ని తృటిలో తప్పించుకున్నారు. ఎ.. విషయానికొస్తే. మీరు భోజనానికి ఉండటం అవతలి వ్యక్తికి ఇష్టం లేదు. అయినా మీరు అర్థం చేసుకోకుండా పిచ్చి పరిష్కారాలు చెప్పారు. బి.. దగ్గరికి వచ్చేసరికి లంచ్‌బ్రేక్ వరకూ ఎదురుచూస్తే మీ సొమ్మేం పోతుంది? అప్పటికే సభికులు ఆకలితో ఉన్నారని మీకు తెలియదా?
ఇవే శత్రువులు..
మనం నూన్-చీ నుంచి దారితప్పడానికి కారణం ఏమిటి? మనల్ని ప్రలోభపెట్టే అంశాలు ఏవి? నిజాయతీగా ప్రశ్నించుకుంటే, అంతరాత్మను నిగ్గదీసి అడిగేస్తే చాలా సమాధానాలే వస్తాయి.
ఓ సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడే.. పదేపదే అదే పరిష్కారం కళ్లముందు మెదులుతున్నప్పుడు.. కాస్త చోటు మార్చి చూడమంటుంది. కొత్త చోట, కొత్త ఆలోచనలు అంకురిస్తాయని వారి నమ్మకం. ఆ విశ్వాసానికి ఎంతోకొంత హేతుబద్ధత ఉంది కూడా. ఏదైనా తప్పక చెప్పి తీరాల్సినప్పుడు మాత్రమే మీరు నోరు విప్పండి.. అంటుంది కొరియన్ కల్చర్. దాంతోపాటే నలుగురి గురించి ఆలోచించడం నేర్పుతుంది. ఏ భోజనాల దగ్గరో చివరి వరుసలో నిలబడటానికి దేశ అధ్యక్షుడైనా ఇబ్బంది పడడు. ఆ ఎదురుచూపును ఆస్వాదిస్తాడు. ముందువారితోనో, వెనుకవారితోనో అర్థవంతమైన సంభాషణ కొనసాగిస్తాడు. గాలి కబుర్లు ఉండవు. తింటున్నప్పుడు కూడా ఎవరూ ఎవర్నీ బలవంతపెట్టరు. బలవంతపెట్టబోయినా.. ఎదుటి మనిషి ముఖ కవళికల్ని గమనించి వెనక్కి తగ్గుతారు. వదలకుండా వేధించేవారిని ‘బ్యాడ్ నూన్-చీ’ వ్యక్తులుగా వ్యవహరిస్తారు. తన మానసిక ఆరోగ్యం పట్ల సానుభూతి చూపుతారు. సర్దుకుపోతారు.
ఆ ఒక్కటి లేకపోతే..
కొన్నిసార్లు కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. నూన్-చీ కూడా అంతే. మనసు చదవడం రాకపోతే.. మనుషులకు దగ్గర కాలేం. బంధాలను బలపరుచుకోలేం. దక్షిణ కొరియాలోని ఓ నగరంలో పదిమంది ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటున్నారు. పరిమితంగానే అయినా అందరూ మద్యం పుచ్చుకుంటున్నారు. ఒకరు మాత్రం ఏదో సాఫ్ట్‌డ్రింక్ చప్పరిస్తున్నాడు. ఆ బృందంలోంచి ఒకడు పైకి లేచి ‘నువ్వు కూడా మందు తాగాల్సిందే. లేకపోతే.. పార్టీని బహిష్కరిస్తాను’ అంటూ మంకుపట్టు పట్టాడు. ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. చివరికి తేలింది ఏమిటంటే.. ‘పాపం ఆ యువకుడు కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు.
స్నేహితుల మధ్య కాలక్షేపం అవుతుందనే ఉద్దేశంతో వచ్చాడు. ఆ విషయాన్ని మిగిలినవాళ్లంతా గుర్తించారు. ఎందుకంటే వాళ్లకు నూన్-చీ తెలుసు. ఆ మంకుపట్టు మనిషికి త్రం ఆ కళలో ప్రవేశం లేదు. స్నేహితులు అనేకాదు.. భార్యాభర్తలు, అన్నదమ్ములు, సహోద్యోగులు, ఇరుగు-పొరుగు.. బంధాలు బలపడాలంటే మాటలకు అందని మౌనాన్ని అర్థం చేసుకోవాలి. మనసును పుస్తకంలా చదివేయాలి. అందులోనూ ‘క్విక్ నూన్-చీ’ తెలిసినవారు పరిసరాల్ని ఇట్టే అన్వయించుకుంటారు. పరిస్థితుల్ని వేగంగా గ్రహిస్తారు.
బోరు కొట్టకండి..
బోరింగ్‌గా మాట్లాడేవారు మంచివాళ్లే కావచ్చు. కానీ ఎవరూ వాళ్లను ప్రోత్సహించరు. దగ్గరికి
రానివ్వరు. కనిపించినా మొహం తిప్పేసుకుంటారు. ఆ కబుర్లు వింటున్నకొద్దీ కడుపులో తిప్పేసిన భావన
కలుగుతుంది. నూన్-చీ.. అనవసర సంభాషణలను పరిహరించమని చెబుతుంది.
క్లుప్తతకు విలువ ఇస్తుంది. మాటలో పొదుపు, పలకరింపులో ఒడుపు.. నూన్-చీ మానవ సంబంధ సూత్రాలు. చాలా సందర్భాల్లో మౌనానికి భయపడేవారే లొడలొడా వాగేస్తుంటారు. దీంతో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. వాళ్లను పెద్దగా ప్రోత్సహించకండి. సానుభూతి చూపకండి. ఆ ప్రవాహానికి అడ్డకట్ట వేయండి. ఇక్కడే ఇంకో విషయాన్నీ చర్చించాలి.. పొగడ్త! ప్రతి పొగడ్తనూ స్వీకరించకండి. అందులో కొన్ని మొహమాటాలూ ఉంటాయి.
ఏది పొగడ్తో, ఏది మొక్కుబడి ప్రశంసో తెలుసుకోవాలంటే నూన్-చీ తెలిసి ఉండాలి. మిమ్మల్ని ప్రేమించేవారికి మీరు ఏం చేసినా, ఏం రాసినా నచ్చినట్టే అనిపిస్తుంది. దీంతో, కర్ణ కఠోరంగా ఆలపించినా ‘బాగా పాడారు’ అంటారు. అదంతా నిజమే
అనుకుని ‘అయితే.. ఇంకో పాట వినిపిస్తాను’ అంటూ గొంతెత్తకండి. ఆ అమాయకులు పరుగెత్తేస్తారు. అది ప్రేమతో ఇచ్చిన కితాబా, నైపుణ్యానికి మురిసిపోయి అందించిన ప్రశంసా .. అనేది అర్థం చేసుకోవాలన్నా మనసును చదివే శక్తి ఉండాలి. నూన్-చీతో ఆ పరిపూర్ణత వస్తుంది.
రకరకాలు..
నూన్-చీలో అనేక రకాలు. కొన్ని పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఇంకొన్ని నెగెటివ్ ఎనర్జీని నియంత్రిస్తాయి. మరికొన్ని తటస్థంగా మారుస్తాయి. మొత్తంగా మనిషి మూలాల్ని తడిమే కళ ఇది. మానవుడు సంఘజీవి. నూన్-చీ సంఘ కళ. సామాజిక జీవితం అనివార్యం. సంఘాన్ని తప్పించుకోలేం. దాంతో మసలడం ఎలాగో తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు సుఖంగా ఉంటావు. సంతోషంగా బతుకుతావు. కొరియన్ జీవనకళ నేర్పేదీ ఇదే. మనిషి ముఖాన్ని
చదవగలిగితే సంఘాన్ని, ఆపైన సమాజాన్ని చదవడం పెద్ద కష్టమేం కాదు. పొరుగువాడు, సహోద్యోగి, సహపాఠి, కాలనీ, ఆఫీసు.. ఎవర్నీ దేన్నీ ఎంచుకోం మనం. యాదృచ్ఛికంగా మన జీవితంలో భాగమైపోవడం జరుగుతుందంతే. ఆ మార్పును మనం యథాతథంగా స్వీకరించాలి. ఉన్నది ఉన్నట్టే ఆమోదించాలి.
మరో ఆలోచన లేకుండా కలిసి బతకాలి. ఇక్కడ జరిగే ప్రక్రియలు రెండే.. నిశితంగా గమనించడం, హృదయ పూర్వకంగా స్వీకరించడం. ఆ ప్రక్రియ ఎంత వేగంగా జరిగితే అంత తొందరగా మనం స్థిరపడతాం, స్థిమితపడతాం. ఆనందంగానూ ఉంటాం. దీనివల్ల మంచి పొరుగువ్యక్తి అనిపించుకుంటాం, మంచి స్నేహితుడు అవుతాం. అయితే, దీనికి కొంత సాధన కావాలి.ఒకటి.. ముందుగా మీ మెదడులోని పాత సరుకునంతా తీసేయండి. బుర్రను ఖాళీ చేసుకోండి. మీ చేతిలోని కప్పు ఖాళీ అయితేనే కదా, కమ్మని తాజా చాయ్ నింపుకోడానికి వీలవుతుంది.రెండు.. ఏదైనా ఓ కొత్త చోటుకు వెళ్లినప్పుడు.. అప్పటికే అక్కడ ఉన్నవారిని గమనించండి. వాళ్ల మనసును చదవగలిగితే కొత్త సమాచారం లభిస్తుంది.
మూడు.. ఎవరూ తమ మనసులోని మర్మాన్ని వెల్లడించరు. రెండు వాక్యాల మధ్య, రెండు పదాల మధ్య నక్కినక్కి దాకున్న ఆ సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నాలుగు.. ప్రతి ప్రయత్నం సఫలం కాదు. ప్రతి బేరీజూ నిజం కాలేదు. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. అయినా నిరాశపడకండి. నూన్-చీ కూడా సైకిలు నేర్చుకోవడం లాంటిదే. పడతాం. లేస్తాం. మళ్లీ పడతాం. మళ్లీ లేస్తాం. ఇంకెప్పుడూ పడం!
సృష్టిలో అత్యంత శక్తిమంతమైన జీవులే బతికి బట్టకట్టినట్టు దాఖలాలు లేవు.
మార్పును గుర్తించే, మార్పును ఆమోదించే, మార్పును భాగం చేసుకునే నూన్-చీ ప్రాణులే యుగాలుగా, తరాలుగా మనుగడ సాగిస్తున్నాయి. వేగంగా తమ సంతతిని పెంచుకుంటున్నాయి. రాజ్యాలు ఏలేస్తున్నాయి. అది
అడవి కావచ్చు, భూమి కావచ్చు, సముద్రమూ కావచ్చు. జై నూన్-చీ!
బంగారు చెంచా!
నూన్-చీని అతిసామాన్యుల ఆయుధంగా అభివర్ణిస్తారు కొరియన్లు. ఎదుటి మనిషిని అర్థం చేసుకునే శక్తే నీకున్న సైన్యం. మనసులో దూరిపోయి అంతరంగాన్ని గ్రహించగలిగిన విద్యే.. మేనేజ్మెంట్ డిగ్రీ. నూన్-చీ తెలియకపోతే మాత్రం, నోట్లో బంగారు చెంచాతో పుట్టినా సరే.. ఆ చెంచా ఏదో ఓ దశలో నోట్లోంచి జారిపోవడం ఖాయమని చెబుతారు కొరియన్ పెద్దలు.
బేరసారాల్లోనూ
లావాదేవీలకూ నూన్-చీ సూత్రాన్ని అన్వయించుకోవచ్చు. ఆ సమయంలో మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత ప్రయోజనం. ఎంత తక్కువ మాట్లాడితే అంత లాభపడతాం. ఇల్లు కొనడానికి వెళ్లినప్పుడు, ‘ఎంతమంది పిల్లలు సార్?’ అనే ప్రశ్న ఏజెంట్ నోటి నుంచి యథాలాపంగా ఏం రాదు. మీ జవాబును బట్టి ‘దగ్గరే మంచి స్కూల్స్ ఉన్నాయి సార్. ట్రాన్స్‌పోర్టేషన్ తలనొప్పే ఉండదు’ అని ఊరిస్తాడు. అతని మనసును ముందే గ్రహించి.. మనం ఆ ప్రశ్నను దాటవేయాలి. దళారీ దవాఖానల గురించి చెప్పినా, చీరల దుకాణాల గురించి వర్ణించినా… మిమ్మల్ని ఖరీదైన బేరానికి ఒప్పించడమే లక్ష్యం. అతని వలలో పడకండి. ప్రతి ప్రశ్నకూ ‘అవునా..’ అని మాత్రమే సమాధానం ఇవ్వమని సలహా ఇస్తారు నూన్-చీ నిపుణులు.
చిన్నపాటి పరీక్ష
అదొక రెస్టారెంట్. టేబుల్స్ అన్నీ నిండుగా ఉన్నాయి. ఖాళీ అయ్యేవరకూ ఎదురు చూడాల్సిందే.
ముఖ్యంగా నాలుగు టేబుల్స్ మీద మీరు దృష్టిపెట్టారు.
ఏది ముందు ఖాళీ అవుతుంది.
ఎ. ఓ ప్రేమజంట కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడుకుంటున్నది.
బి. హెడ్‌ఫోన్స్ పెట్టుకున్న కుర్రాడు అప్పటికే నాలుగు కప్పుల కాఫీ లాగించేసి.. లాప్టాప్లో తలదూర్చాడు.
సి. సూటూబూటులో కూర్చున్న పెద్ద మనుషులు అసహనంగా కదులుతున్నారు.
డి. కొందరు అమ్మలు పిల్లలతో కాలక్షేపం చేస్తూ కూర్చున్నారు.
ఇదీ సంగతి. మీ సమాధానం ‘సి’ అయితే కరెక్ట్. ఎందుకంటే వాళ్లు స్నేహితులు కాదు, అనుబంధాలు లేవు. వ్యాపార చర్చల కోసమే వచ్చారు. పనైపోగానే ఖాళీ చేస్తారు. ప్రేమ జంటకైనా, ప్రేమ మూర్తులైన అమ్మలకైనా సమయమే తెలియదు. ఇక, పని చేసుకోడానికే రెస్టారెంట్‌కు వచ్చినవాడు.. లక్ష్యం పూర్తయ్యేదాకా కదిలే ప్రసక్తే లేదు. మనసులను చదవగలిగితేనే.. ఇలాంటి
సందర్భాల్లో బేరీజు సాధ్యం.
స్టీవ్జాబ్స్లో ఓ గొప్ప నూన్-చీ నిపుణుడు ఉన్నాడని చెబుతారు పరిశీలకులు. ఎదుటి మనిషిని అంచనా వేయడంలో తను దిట్ట. ఆ వ్యక్తి బలాలను తూకమేసి నట్టు గుర్తించగలడు. కాబట్టే, ప్రతి కస్టమర్ మనసులోకి తొంగి చూసినంత పక్కాగా ఆపిల్ ఉత్పత్తులను డిజైన్ చేయగలి గాడు. నూన్-చీ ఉత్తమ ఆంత్ర ప్రెన్యూర్ లక్షణం.
అప్పుడేం చేయాలి?
నూన్-చీ సున్నితమైన సమస్యలకు కూడా పరిష్కారం చూపుతుంది. ఓ మిత్రుడు ఆ మధ్యే విడాకులు తీసుకుంటాడు. ఆ సంగతి చాలా మందికి తెలియదు. ఎక్కడికి వెళ్లినా ‘మీ ఆవిడను తీసుకురాలేక పోయారా?’ అనే ప్రశ్నే. నూన్-చీలో నిపుణుడైన ఓ వ్యక్తి తనకు ఓ సలహా ఇచ్చాడు. ‘ప్రతి బంధమూ కలకాలం నిలబడాలని లేదు. కొన్ని మొదట్లో, కొన్ని మధ్యలో, కొన్ని చివర్లో.. విచ్ఛిన్నం అవుతాయి. ఆ మాత్రం దానికి భయపడితే ఎలా? అయినా నీకు ఇబ్బందిగా అనిపిస్తే.. పూర్తి వ్యక్తిగత సంభాషణలకు ఆస్కారం ఉన్న కార్యక్రమాలకు రావద్దు. సాహితీ సమావేశాలు, సామూహిక ప్రార్థనలు, స్పోర్ట్స్ మీట్స్.. మొదలైన చోట్ల ఆయా అంశాల గురించి మాత్రమే చర్చ జరుగుతుంది. అక్కడికి వెళ్లు. నీకూ ఇబ్బంది ఉండదు’ అని సలహా ఇచ్చాడు. గొప్ప పరిష్కారం కాకపోవచ్చేమో కానీ, ఎంతోకొంత చికాకును తప్పించే మార్గమిది. జీవితంలో ఆ పాటి లౌక్యం ఉండాలి.