రాష్ట్ర స్థాయి ఉత్తమ అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీల పరిధిలో మెరుగైన సేవలు అందిస్తున్న వారికి ఈ అవార్డులు లభించగా, శాతవాహన పరిధిలో నలుగురు ఎంపికయ్యారు. అందులో ఒకరు అసోసియేట్ ప్రొఫెసర్ కాగా, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు.
కమాన్‌చౌరస్తా/ హుజూరాబాద్‌టౌన్ సెప్టెంబర్ 2 : రాష్ట్ర స్థాయి ఉత్తమ అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల జాబితాను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించగా, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నలుగురు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులు అందుకోనున్నారు.
ఎస్‌యూ అసోసియేట్ ప్రొఫెసర్..
శాతవాహన యూనివర్సిటీలో ఉర్దూ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న అబ్రార్ ఉల్ బాఖీ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఉర్దూలో ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన అబ్రార్ 2009లో ఎస్‌యూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత, 2021లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. ఈయన ఇప్పటి వరకు ఉర్దూ లిటరేచర్‌కు సంబంధించి ఆరు పుస్తకాలు రాయగా, మైనార్టీ వెల్ఫేర్సొసైటీ నుంచి అవార్డు సైతం అందుకున్నారు. అబ్రార్ ఆధ్వర్యంలో ఒక విద్యార్థి పీహెచ్డీ పూర్తి చేయగా, ఇంకో ముగ్గురు రీసెర్చ్ చేస్తున్నారు. అబ్రార్ రాసిన 20 వరకు యూజీసీ అప్రూవల్ జర్నల్స్ పలు యూనివర్సిటీల సిలబస్‌లో ప్రచురితమయ్యాయి.
ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు..
జగిత్యాలలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ హర్జోత్ కౌర్ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. పదేళ్లుగా విద్యాభివృద్ధి కోసం చేసిన కృషి వల్లే ఈ అవార్డు దక్కిందని, తనపై మరింత బాధ్యత పెరిగిందని హర్జోత్కౌర్ పేర్కొన్నారు.
వేములవాడ మండలం అగ్రహారం డిగ్రీ కళాశాలలో బాటనీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తిరుకోవెల శ్రీనివాస్ రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్ తెలిపారు.
హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ పాలకుర్తి దినకర్ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. 2011లో కోరుట్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటిసారిగా అధ్యాపకుడిగా విధుల్లో చేరగా, 2018 జూన్‌లో హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. దినకర్ ఇప్పటి వరకు 15 పుస్తకాలను రచించగా, 100కు పైగా స్రిప్టులను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ఇటీవల జాతీయస్థాయి పీవీ నరసింహారావు మెమోరియల్ అవార్డు సైతం అందుకున్నారు. అలాగే, అనువాద ఆదిత్య బిరుదు పొందారు. ఆయన రాసిన ఆర్టికల్స్, అంతర్జాతీయ జర్నల్స్ ప్రాముఖ్యత పొందాయి. దినకర్ డిగ్రీ మొదటి, మూడో సంవత్సరం ఇంగ్లిష్ టెక్ట్స్బుక్లో ఒక పాఠాన్ని రచించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. అంతేకాకుండా ఆయన ఎన్నో సంస్థల నుంచి అవార్డులు, రివార్డులు అందుకున్నారు.