Ramagundam | కోల్ సిటీ, సెప్టెంబర్ 28 : ఇటీవల జరిగిన రామగుండం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆమోదించిన ఎజెండాలోని ప్రభుత్వానికి ఆర్థిక నష్టం చేకూర్చే అంశాలను రద్దు చేయాలని బీఆర్ఎస్, సీపీఐ ఫ్లోర్ లీడర్లు మేకల సమ్మయ్య యాదవ్, మార్కపురి సూర్య డిమాండ్ చేశారు. నూతన మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 65 అనుసరించి జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఆ ఎజెండాలను రద్దు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ఏవో బండి ప్రకాష్ కు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ బతుకమ్మ వేడుకల పేరిట 120 వాట్స్ ఫ్లడ్ లైట్లు అద్దె ప్రాతిపదికన రూ.22 లక్షలు కేటాయిస్తూ ఆమోదించారనీ, కానీ అవే డబ్బులతో మున్సిపల్ సొంతగా ఫ్లడ్ లైట్లు కొనొచ్చనీ, దాంతో ఐదేళ్లలో రూ.80లక్షలు ప్రజాధనం ఆదా అవుతుందని తెలిపారు.
అలాగే అర్బన్ చాలెంజ్ ఫండ్ కోసం డీపీఆర్ తయారీకి ప్రైవేటు కన్సల్టెన్సీలకు అప్పగిస్తూ తీర్మానించిన అంశంను పునఃపరిశీలించి రద్దు చేయాలనీ, కార్పొరేషన్ లో ఘనత కలిగిన ఇంజనీర్లు ఉండగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి రూ.కోటి 80 లక్షల ప్రజాధనంను దుబారా చేయడమేనన్నారు. అలాగే నర్సరీలో మొక్కలు ఎండిపోయేలా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు వన మహోత్సవం పేరిట రూ.64లక్షలు కేటాయించారనీ, గతంలో సింగరేణి నిధులు రూ.35 లక్షలతో మున్సిపల్ జంక్షన్ నుంచి పైవింక్లయిన్ వరకు నాటిన మొక్కలను పట్టించుకోకపోవడం వల్ల అవి ఎండిపోయాయన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వన మహోత్సవం అంశంను రద్దు చేయాలని కోరారు.
వీధి దీపాల ఏర్పాటుకు పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ లో ఒప్పందం చేసుకోవడం ద్వారా సుమారు రూ.4.5 కోట్ల ప్రజాధనం ప్రతి ఏటా చెల్లించాల్సి వస్తుందనీ, అదే డబ్బుతో మున్సిపల్ ఎలక్ట్రికల్ విభాగంను పటిష్టంగా మార్చుకోవచ్చని తెలిపారు. వెంటనే ఆ అంశాలను పరిశీలించి ప్రజాధనం దుర్వినియోగం గాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తోకల రమేష్, సీపీఐ నాయకులు శనిగరపు చంద్రశేఖర్ పాల్గొన్నారు.