Donald Trump : వెనెజువెలా (Venezuela) లో తనకు ప్రజాదరణ పుష్కలంగా ఉందని, భవిష్యత్తులో తాను ఆ దేశ అధ్యక్షుడిగా పోటీచేస్తానేమోనని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జోక్ చేశారు. వెనెజువెలాకు మంచి అధ్యక్షుడు అనిపించుకునేందుకు త్వరలో స్పానిష్ నేర్చుకుంటానని అన్నారు. వైట్‌హౌస్ (White House) లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను వెనెజువెలా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగితే ఆ దేశంలో ఇప్పటివరకూ ఎవరికీ రానన్ని ఎక్కువ ఓట్లు తనకు వస్తాయని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగిసిన తర్వాత అక్కడికి వెళ్లి పోటీ చేస్తానేమోనని కామెంట్ చేశారు.
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా డెల్సీ రోడ్రిగెజ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ దేశంతో అమెరికా సంబంధాలు బాగున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. వెనెజువెలా నుంచి ఇప్పటికే తాము కోట్ల బ్యారెళ్ల చమురు తీసుకున్నామని చెప్పారు. ఇరాన్‌తో యుద్ధంలో దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా వంటి మిత్రదేశాలు తమకు సహాయం చేయకపోవడంపై ట్రంప్ మరోసారి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. పశ్చిమాసియా యుద్ధం నాటోపై మాయనిమచ్చను మిగిల్చిందని, అది తన మనసు నుంచి ఎప్పటికీ చెరిగిపోదని పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌ను వశం చేసుకునేందుకు తాను ప్రయత్నాలు మొదలుపెట్టిన తర్వాత నాటోతో విభేదాలు మొదలయ్యాయన్నారు.
జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, నాటో.. ఇవేవీ తమకు సాయం చేయలేదని వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా నుంచి జపాన్ను రక్షించేందుకు ఆ దేశంలో తాము 50 వేల మంది సైనికులను ఉంచామని, కిమ్ జోంగ్ ఉన్ నుంచి కాపాడేందుకు దక్షిణ కొరియాలో 45 వేల మంది సైనికులను మోహరించామని ట్రంప్ గుర్తుచేశారు. కిమ్‌తో తనకు సంబంధాలు బాగానే ఉన్నాయని అన్నారు. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా గెలుపు ఖాయమయ్యాక కొన్ని దేశాలు సాయం చేస్తామంటూ ముందుకొస్తున్నాయని చెప్పారు.