లండన్: నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో ఉక్రెయిన్ చేరడాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాటోలో చేరవద్దు అన్న నినాదంతోనే .. ఉక్రెయిన్‌పై పుతిన్ దాడికి దిగారు. నాటో వైపు మొగ్గు చూపిన ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు ఎంత వరకు సహాయపడుతున్నాయో తెలియదు. నిజానికి ఉక్రెయిన్ సంక్షోభం పశ్చిమ దేశాలను ఒక్కటి చేసినా.. పుతిన్ వేగాన్ని అడ్డుకునేందుకు ఆ దేశాలు సరిపోవడం లేదనిపిస్తోంది. యూరోప్‌లో ఉన్న తూర్పు దేశాల్లో ప్రస్తుతం నాటో బృందాలు ఉన్నాయి. అయితే సరిహద్దు దేశాల్లో నాటో బలగాలు ఉండడాన్ని రష్యా సహించడం లేదు. ఈ విషయంలో ఇప్పటికే నాటోతో పాటు అమెరికాతోనూ రష్యా చర్చించింది. తూర్పు దిశగా నాటో తమ బలగాలను విస్తరించవద్దు అన్నది రష్యా ప్రధాన డిమాండ్. నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వవద్దు అని కూడా రష్యా డిమాండ్ చేస్తోంది.
ఇతర సోవియేట్ దేశాలకు కూడా పుతిన్ ఈ రూల్ విధించారు. సెంట్రల్, ఈస్ట్రన్ యూరోప్‌లో ఉన్న నాటో బలగాలను వెనక్కి తీసుకువెళ్లాలని పుతిన్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే యూరోప్ తూర్పు ప్రాంతాలన్నీ రష్యా ఆధీనంలో ఉండాలన్న అభిప్రాయాన్ని గతంలో పుతిన్ వ్యక్తం చేశారు. ఒకవేళ నాటో దళాలు తూర్పు యురోపియన్ దేశాలకు విస్తరిస్తే, అప్పుడు రష్యా ప్రాబల్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. డాన్బాస్, క్రిమియా, సీ ఆఫ్ అజోవ్, నల్లసముద్రం, ఉక్రెయిన్‌తో పాటు పాతకాలం నాటి సోవియే దేశాలు అన్నీ రష్యా ఆధీనంలోకి రావాలని పుతిన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు సమరభేరి మోగించినట్లు తెలుస్తోంది. 2014 నుంచి ఇదే స్ట్రాటజీతో పుతిన్ అడుగులు వేస్తున్నట్లు కొందరంటున్నారు. నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వవద్దు అని అమెరికాను రష్యా గట్టిగా కోరింది.
యుద్ధ ప్రకటన సమయంలో డినాజిఫై చేస్తానంటూ పుతిన్ అన్నారు. నాజీల తరహాలో సాగుతున్న ఊచకోతకు అంతం పలకాలని పుతిన్ తన ప్రసంగంలో తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనెస్కీ నాజీల తరహాలో వ్యవహరిస్తున్నట్లు పుతిన్ ఆరోపించారు. అలనాటి సోవియేట్ యూనియన్ తరహాలో రష్యా ప్రాంతాన్ని బలోపేతం చేయాలనుకున్న పుతిన్.. ఉక్రెయిన్‌పై యుద్ధంతో తన వ్యూహానికి పదునుపెట్టారు. అయితే పుతిన్ ఆక్రమణ సిద్ధాంతానికి నాటో, అమెరికాతో పాటు యూరోప్ దేశాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.