Olena Zelenska | ఉక్రెయిన్పై చేస్తున్న దండయాత్రలో రష్యా సైనికులు అత్యాచారాలు, లైంగిక వేధింపులను ఆయుధంలా వాడుకుంటున్నారని ఉక్రెయిన్ ప్రథమ మహిళ, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ భార్య ఒలెనా జెలెన్స్కా ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలు, అల్లర్ల సమయంలో లైంగిక హింసను అరికట్టాలన్న అంశంపై లండన్లో ఏర్పాటు చేసిన ఓ అంతర్జాతీయ సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. యుద్ధం సమయంలో ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలకు రష్యా సైనికుల భార్యలే వారిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
‘మా దేశంపై దండయాత్ర చేస్తున్న రష్యా సైనికులు అత్యాచారాలు, లైంగిక వేధింపులను ప్రత్యేక ఆయుధంలా వాడుకుంటున్నారు. ఒకరిపై ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి లైంగిక హింస అనేది అత్యంత క్రూరమైన మార్గం. యుద్ధాల సమయంలో ఇలాంటివి జరిగినా బాధితులు భయంతో ఆ విషయాలు బయటపెట్టలేరు. ప్రస్తుతం మా దేశంలో రష్యా దళాలు దీన్నే ఆయుధంలా వాడుకుంటున్నాయి. దీన్ని వారు చాలా క్రమపద్ధతిలో, బహిరంగంగానే ఉపయోగిస్తున్నారు. వాస్తవం ఏంటంటే.. ఈ దాడులను సైనికుల భార్యలే ప్రోత్సహించడం. ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం స్పందించాల్సిన అవసరం ఉంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.