మెల్బోర్న్: పంజాబీ గాయకుడు నిర్వేయిర్ సింగ్.. ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మెల్బోర్న్లో మూడు వాహనాలు ఢీకొన్న ఘటనలో అతను చనిపోయాడు. బుల్లా డిగ్గర్స్ రెస్ట్ రోడ్డు వద్ద మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన 23 ఏళ్ల కియా సెడాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగానికి వెళ్తున్న క్రమంలో సింగర్ నిర్వేయిర్ను వాహనం ఢీకొట్టింది. వేగంగా వచ్చి అదుపు తప్పిన కియా కారు.. ఆ తర్వాత రెండు వాహనాలను, ఓ జీపును ఢీకొట్టింది. గాయకుడు కావాలన్న ఉద్దేశంతో 9 ఏళ్ల క్రితం నిర్వేయిర్ సింగ్ ఆస్ట్రేలియాకు వచ్చాడు. మై టర్న్ ఆల్బమ్‌లోని తేరే బిన్ సాంగ్ అతని కెరీర్లో పెద్ద హిట్. ఆయన పాడిన దర్దే దిల్, జీ రుస్గీ, ఫెరారీ డ్రీమ్, హిక్ తోక్ కే పాటలు కూడా హిట్ అయ్యాయి.