Riyadh airport : సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంపై హౌతీ ఉగ్రవాదుల దాడులు కొనసాగుతుతున్నాయి. తాజాగా రియాద్‌లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై హౌతీలు దాడి చేశారు. బాలిస్టిక్ మిస్సైళ్లతో ఎయిర్‌పోర్టుపై దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు. దీంతో ఈ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల ప్రయాణం, భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దాడి నేపథ్యంలో ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇదే సమయంలో రియాద్ వెళ్లే అనేక అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని పలు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు రద్దు చేసుకుంటున్నాయి.
ఇండియా నుంచి రియాద్ వెళ్లే విమాన సర్వీసుల్ని అక్టోబర్ 10 వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు ప్రకటించాయి. ఈ మేరకు ప్రయాణికులకు సమాచారం అందించాయి ఆయా సంస్థలు. విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తిస్థాయి రిఫండ్ అందిస్తామని ప్రకటించాయి. ఈ ప్రకటనకు ముందు ఢిల్లీ నుంచి రియాద్ బయల్దేరిన విమానాన్ని తిరిగి వెనక్కి రప్పించారు. విమానం ల్యాండ్ అవ్వాల్సిన ఎయిర్‌పోర్టుపై మిస్సైల్ దాడులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. హౌతీ దాడుల కారణంగా సౌదీ ప్రభుత్వం రియాద్ ఎయిర్‌పోర్టును మూసేసింది.
Footage shows a massive plume of smoke rising from King Khalid International Airport in Riyadh, Saudi Arabia.
It is now the most disrupted airport in the world, Ansarallah ballistic missile attacks are becoming a daily occurrence. https://t.co/JwD3ouVNd6
— MoloMonitor 🇮🇹 (@MoloWarMonitor) October 8, 2026
ఎయిర్‌పోర్టు వద్ద అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు అందుబాటులో ఉంచారు. ఎయిర్‌పోర్టు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాల్ని అధికారులు రద్దు చేశారు. ప్రయాణికుల్ని అత్యవసరంగా బయటకు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, ఎన్ని విమానాలు రద్దయ్యాయి అనే విషయంలో స్పష్టత లేదు. కొద్ది రోజులుగా సౌదీపై హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. మంగళవారం, బుధవారం సౌదీపై జరిగిన దాడుల్లో ముగ్గురు మరణించారు. హౌతీలు.. యెమెన్ దేశంలోని తిరుగుబాటు సంస్థకు చెందిన ఉగ్రవాదులు. వీరు పొరుగునే ఉన్న సౌదీపైనే కాదు.. సొంత దేశం యెమెన్‌లోని ప్రభుత్వంపై, అక్కడి సైన్యంపై తిరుగుబాటు చేస్తున్నారు.
యెమెన్‌లోని అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నారు. వీరికి ఇరాన్ ప్రభుత్వం అండగా ఉంటోంది. హౌతీలను ఉగ్ర సంస్థగా పేర్కొంటారు. ఇక, యెమెన్ ప్రభుత్వానికి సౌదీ మద్దతు ఇస్తోంది. దీంతో అక్కడ సౌదీ మద్దతు ఉన్న యెమెన్ అధికార సైన్యానికి, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలకు మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూనే ఉంది. ఇటీవల ఇరాన్ దాడిలో సౌదీ.. అమెరికా వైపు ఉండటంతో.. సౌదీపై ఇరాన్ అనుకూల హౌతీలు దాడి చేస్తున్నారు. మరోవైపు సౌదీకి మద్దతుగా పాక్, టర్కీకి చెందిన సైన్యం రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.