లండన్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హమ్(David Beckham), ఆయన సతీమణి విక్టోరియా బెక్‌హమ్ ఇప్పుడు ఆ దేశంలో సంపన్న వ్యక్తులుగా మారారు. ఆ దేశ చక్రవర్తి కింగ్ చార్లెస్-3 కన్నా ఎక్కువ ఆదాయం బెక్‌హమ్‌కు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో బెక్‌హమ్ ఆదాయం రెట్టింపు అయ్యింది. ద మెట్రో మీడియా దీనిపై ఓ కథనాన్ని రాసింది. బెక్హ్ ఫ్యామిలీ సంపద సుమారు 1.185 బిలియన్ల పౌండ్లు. అంటే సుమారు 15 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక మరో వైపు కింగ్ చార్లెస్-3 వ్యక్తిగత సంపద సుమారు 680 మిలియన్ల పౌండ్లుగా అంచనా వేస్తున్నారు. అంటే సుమారు 8 వేల కోట్లుగా ఉంది. అయితే బెక్‌హమ్ దంపతుల ఆదాయం రెట్టింపు అవుతున్నట్లు గుర్తించారు. ఫుట్‌బాల్ ఇన్వెస్ట్మెంట్లు, ఫ్యాషన్ బిజినెస్‌లు, బ్రాండ్ పార్ట్నర్షిప్లు, మీడియా ప్రాజెక్టుల్లో బెక్‌హమ్ కపుల్ పెట్టుబడి పెట్టింది. ఇంటర్ మియామి సీఎఫ్ ఫుట్‌బాల్ క్లబ్లో బెక్‌హమ్ అధికంగా పెట్టుబడి పెట్టారు. ఇక ఆ అమెరికా క్లబ్‌కు అంతర్జాతీయంగా బాగా గుర్తింపు వచ్చింది. ఆ క్లబ్లో అర్జెంటీనా స్టార్ లియోనిల్ మెస్సీ ఆడుతున్నారు.