మెల్బోర్న్: టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్‌కు మరోసారి నిర్బంధం తప్పలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన ఈ సెర్బియా టెన్నిస్ స్టార్ వీసాను అక్కడి ప్రభుత్వం మళ్లీ రద్దుచేసింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం జకోవిచ్ వీసాను రద్దు చేయడం ఇది రెండోసారి. దాంతో అక్కడి అధికారులు జకోవిచ్‌ను నిర్బంధంలోకి తీసుకున్నారు. అనంతరం కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు.
జకోవిచ్ కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా ఆస్ట్రేలియాకు వెళ్లడమే ఇందుకు కారణమైంది. ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకోని వారికి దేశంలోకి ప్రవేశం లేదు. ఈ క్రమంలో వాక్సిన్లు తీసుకోకుండా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన జకోవిచ్ వీసాను ప్రభుత్వం రద్దుచేసింది. దాంతో ఆయన అక్కడి కోర్టును ఆశ్రయించగా ఆ కోర్టు.. జకోవిచ్ వీసాను పునరుద్ధరించింది. అయితే, ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి అలెక్స్ హాక్ తన విశిష్ట అధికారాన్ని ఉపయోగించి జకోవిచ్ వీసాను మరోసారి రద్దు చేశారు.
ఈ క్రమంలో అధికారులు జకోవిచ్‌ను మెల్బోర్న్లోని పార్క్ హోటల్‌కు తరలించారు. ఆ హోటల్‌ను ప్రస్తుతం కరోనా నిర్బంధ కేంద్రంగా వినియోగిస్తున్నారు. ఈ వ్యవహారంపై సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ ఉసిక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జకోవిచ్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం అవమానించిందని వ్యాఖ్యానించారు. జకోవిచ్‌ను ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ చరిత్రలో 10వ టైటిల్ గెలనివ్వద్దు అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.
దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కూడా స్పందించారు. కరోనా రక్కసిపై పోరాటంలో భాగంగా ఆస్ట్రేలియా ప్రజలు ఎన్నో త్యాగాలు చేయడమే కాకుండా, సుదీర్ఘకాలం నిర్బంధంలో గడిపారన్నారు. వ్యాక్సిన్లు తీసుకోని జకోవిచ్‌ను నిబంధనలకు విరుద్ధంగా అనుమతించడం ద్వారా ప్రజల స్ఫూర్తిని దెబ్బతీయలేమని చెప్పారు. అంతేగాక జకోవిచ్‌ను అనుమతిస్తే దేశంలో వ్యాక్సిన్లపై ప్రజల వ్యతిరేక భావన బలపడుతుందన్నారు.