జనరేషన్లు మారుతున్నా కొద్దీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా కాలాన్ని చూశాం. ఇక నుంచి దానికి మించిన కాలాన్ని చూడబోతున్నాం. అందులో మొదటిది ఎన్ఎఫ్టీ. నాన్ ఫంగిబుల్ టోకెన్స్ పేరుతో వర్చువల్ వరల్డ్‌లో ఇది రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమ ఎన్ఎఫ్టీలను వేలంలో పెట్టారు.
కొందరు సెలబ్రిటీలు అయితే.. తమకు నచ్చిన ఎన్ఎఫ్టీలను కోట్లు పెట్టి మరీ కొంటున్నారు. తాజాగా.. అమెరికాకు చెందిన ఆర్టిస్ట్ రాబ్నెస్ అయితే.. పనికిరాని ట్రాష్ క్యాన్‌ను ఏకంగా రూ.1.88 కోట్లకు అమ్మేశాడు.
చెత్త వేసుకునే ప్లాస్టిక్ ట్రాష్‌క్యాన్ అది. అది అసలు నాకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకే తెలియదు. కానీ.. అది నాకు నచ్చింది. అందుకే ఎన్ఎఫ్టీలో లిస్ట్ చేశాను. దాన్ని వేలంలో ఉంచగా.. 252,000 డాలర్లకు అమ్ముడుపోయింది.. అని లాస్ ఏంజెల్స్‌కు చెందిన రాబ్నెస్ చెప్పుకొచ్చాడు.
సూపర్రేర్ ఎన్ఎఫ్టీ మార్కెట్లోనే దీన్ని రాబ్నెస్ లిస్ట్ చేశాడు. అయితే.. కొన్ని రోజుల తర్వాత దాన్ని సూపర్రేర్ తొలగించింది. ఆ తర్వాత మళ్లీ దాన్ని లిస్ట్ చేసింది. తాజాగా దానికి డిమాండ్ పెరిగి పెద్ద మొత్తానికి అమ్ముడుపోయింది.
ఎన్ఎఫ్టీలలో ప్రస్తుతం చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. గత సంవత్సరం ఎన్ఎఫ్టీలలో 40 బిలియన్ డాలర్ల సేల్స్ జరిగాయట. అంటే.. మన కరెన్సీలో సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట.