ఉప్పల్, జూన్ 12: ఉప్పల్ స్కైవాక్‌లో ఓ యువకుడు చిక్కుకుపోయిన ఘటన గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌కు చెందిన రాహుల్ (20) ఉప్పల్‌లోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్లో ఉంటూ ఉప్పల్‌లోని ఎన్ఆర్పీలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం రాత్రి డ్యూటీ ముగించుకొని హాస్టల్‌కు వెళ్తున్న సమయంలో ఉప్పల్ స్కైవాక్ 6బీ లిఫ్ట్ ఎక్కి దిగుతుండగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. రాత్రి సుమారు 11:30గంటల నుంచి రాహుల్ లిఫ్ట్‌లోనే చిక్కుకుపోయి ఉన్నాడు.
సమాచారం అందుకున్న హైడ్రా అధికారులు, ఉప్పల్ పోలీసులు, హెచ్ఎండీఏ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని యువకుడిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు.. అయితే లిఫ్ట్ తెరుచుకోకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. లిఫ్ట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కృష్ణ కన్స్ట్రక్షన్ సిబ్బంది స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టకేలకు ఆ యువకుడిని రాత్రి 1 గంట సమయంలో బయటకు తీశారు. రాహుల్ సురక్షితంగా బయటకు రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ లిఫ్ట్ నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిర్వాహకులు లిఫ్ట్‌ను రిపేర్ చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.