ఖైరతాబాద్, అక్టోబర్ 7 : పేదల పెద్దాసుపత్రి నిమ్స్ దవాఖానకు రోగుల తాకిడి పెరిగింది. ఆస్పత్రి బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సగటున రోజుకు 5వేలకు పైగా రోగులు వివిధ చికిత్స కోసం వస్తున్నారు. ఇటీవల ఒకే రోజులో 5,635 మంది ఓపీ సేవలు పొందగా, 5,088 మంది వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
అదే రోజున 306 మంది రోగులు ఇన్ పేషెంట్ చికిత్స కోసం దవాఖానలో చేరారు. గతంలో నిమ్స్‌కు రోజుకు సుమారు 3,500 మంది వరకు ఓపీ రోగులు వచ్చేవారు ప్రస్తుతం ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. సాధారణంగా ఓపీ విభాగానికి వచ్చే రోగులతో పాటు ఇతర ఆస్పత్రుల నుంచి రిఫర్ అయ్యే వారు, వివిధ స్పెషాలిటీ వైద్య సేవలు, ఫాలోఅప్ చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా డయాగ్నస్టిక్ సేవల విషయంలోనూ రోగుల తాకిడి పెరిగింది.
ఖైరతాబాద్, అక్టోబర్ 7: రక్త పరీక్షలు, సానింగ్, ఇతర వైద్య నిర్ధారణ పరీక్షల కోసం నిమ్స్ దవాఖానను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. నిమ్స్‌కు ఒకే రోజులో 5,088 మంది రోగులు వివిధ టెస్టులు చేయించుకోవడం ద్వారా దవాఖానలో డయాగ్నొస్టిక్ సేవలకు ఉన్న ఆవశ్యకత స్పష్టమవుతోంది. ఓపీకి మాత్రమే కాకుండా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందే రోగుల సంఖ్య కూడా పెరిగింది. ఒకే రోజులో 306 మంది రోగులు ఇన్ పేషెంట్ విభాగాల్లో అడ్మిట్ అయినట్లు ఆస్పత్రి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వివిధ అనారోగ్య సమస్యలకు ప్రత్యేక వైద్య విభాగాల్లో చికిత్స అవసరమైన రోగులు నిమ్స్‌ను ఆశ్రయిస్తుండటంతో ఐపీ సేవలపై కూడా భారం పెరుగుతోంది.
నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలోనూ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గతంలో రోజుకు సుమారు 50 మంది వరకు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స కోసం చేరే వారు. ప్రస్తుతం ఈ సంఖ్య రోజుకు 80 నుంచి 90 మందికి చేరినట్లు చెబుతున్నారు. అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగులు నిమ్స్ ను ఆశ్రయించడం పెరగడంతో ఎమర్జెన్సీ విభాగంలోనూ రద్దీ పెరిగింది.
పెరుగుతున్న రోగుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఓపీ రిజిస్ట్రేషన్ సేవల సమయాన్ని కూడా నిమ్స్ అధికారులు పొడిగించారు. గతంలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ఓపీ రిజిస్ట్రేషన్ ఉండగా, ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల వరకు రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో ఉదయం సమయానికి రాలేని రోగులకు కూడా ఓపీ సేవలు పొందే అవకాశం లభిస్తోంది. రిజిస్ట్రేషన్ సమయం పెరగడం వల్ల రోజువారీగా ఎకువ మంది రోగులకు వైద్య సేవలు అందించే అవకాశం ఏర్పడింది.