సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వ్యాప్తంగా సోమవారం మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు, నాయకులు సిద్ధమయ్యారు. నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలతో పాటు, వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ప్రత్యేకతను చాటేలా ప్రణాళికలు చేశారు. కేటీఆర్ వ్యక్తిత్వం, తెలంగాణ ఉద్యమం, సాధించిన విజయాలను వివరిస్తూ ప్రత్యేక సాంగ్ ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారు. పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యే ప్రముఖుల సమక్షంలో ప్రత్యేకంగా తయారు చేసిన భారీ కేక్‌లను కట్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. భారీస్థాయిలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఫ్లెక్సీలు కట్టి యువత తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వినూత్నంగా కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్
కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను నెక్లెస్ రోడ్డు (పీవీ మార్గ్)లోని థ్రిల్ సిటీ థీమ్ పార్క్‌లో సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్ తెలిపారు. వేడుకల్లో భాగంగా త్రీడీ స్క్రీన్‌పై వినూత్నంగా కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేయనున్నారు. ప్రపంచ రికార్డ్ సాధించిన కుట్టి చే రూబిక్స్ క్యూబ్ ఆర్టిస్ట్‌తో కేటీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్ వ్యక్తిత్వం, పోరాట పటిమ, సాధించిన విజయాలను వివరిస్తూ ప్రత్యేక సాంగ్ ప్రదర్శించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వివిధ టీవీ చానళ్లకు చెందిన వీడియో కెమెరామెన్లకు ఉచితంగా ఏడాది పాటు వర్తించే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన పత్రాలను అందజేస్తామన్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రముఖుల సమక్షంలో ప్రత్యేకంగా తయారు చేసిన భారీ కేక్‌ను కట్ చేయనున్నట్లు వివరించారు.
మెగా హెల్త్ క్యాంపు..
కేటీఆర్ జన్మదినం, కేటీఆర్ యువసేన 8వ వార్షికోత్సవం, తెలంగాణ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ 12వ వార్షికోత్సవం జూలై 24 నాడే కావడం విశేషమని తెలంగాణ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్నాథం ప్రవీణ్ అన్నారు. ఈ సందర్భంగా ఇందిరా పార్క్ చౌరస్తాలో రవి హీలియోస్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్‌భాస్కర్‌గౌడ్ , ప్రెసిడెంట్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ హైదరాబాద్ సహకారంతో మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవకాశాన్ని అన్ని వర్గాల వారు వినియోగించుకోవాలన్నారు.
200 మందికి ఎలక్ట్రిక్ బైకులు పంపిణీ..
రహ్మత్‌నగర్ ఎంజీఎన్ గ్రౌండ్లో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏర్పాట్లు చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కార్యక్రమంలో 200 మందికి ఎలక్ట్రిక్ బైక్‌లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
నేడు 1000 మంది టెకీల రక్తదానం
రాయదుర్గంలోని దివ్యశ్రీ ఎన్ఎస్ఎల్ ఐటీ పార్కులో 10 వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని 1000 మంది ఐటీ ఉద్యోగులు రక్తదానం చేసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ (టీఎఫ్ఎంసీ) సత్యనారాయణ మాతల, డిప్యూటీ సీఆర్వో -ఐటీ తాండ్ర శ్రీనివాస రావు తెలిపారు. దివ్యశ్రీ ఎన్ఎస్ఎల్ ఐటీ పార్కులో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఐటీ ఉద్యోగులు రక్తదానం చేసేలా ఏర్పాటు చేశామన్నారు. ఐదుగురు వైద్యులతో పాటు 40 మంది నర్సింగ్ సిబ్బంది ఈ రక్తదాన శిబిరంలో సేవలందిస్తారని తెలిపారు.